Tollywood: ఆ ఒక్క పని చేయండి వేతనాలు మేం పెంచుతాం.. సినీ కార్మికులతో నిర్మాతలు
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపుపై కొనసాగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చల్లో కొన్ని కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన తెలిపారు. అయితే, పని విధానాలపై కొన్ని షరతులకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నిర్మాతల షరతులు ఏమిటి?
గత కొద్ది రోజులుగా సినీ కార్మికుల ఫెడరేషన్ వేతనాల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ డిమాండ్లకు అంగీకరించేందుకు నిర్మాతలు కొన్ని షరతులు విధించారు. ముఖ్యంగా, 2018, 2022లో జరిగిన ఒప్పందాల్లోని కొన్ని నిబంధనలను కార్మిక సంఘాలు పాటించడం లేదని నిర్మాతలు చెబుతున్నారు. ఈ ఒప్పందాలను అమలు చేయాలని, దాంతో పాటు మరికొన్ని కొత్త షరతులను కూడా అంగీకరించాలని నిర్మాతలు కోరుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటేనే వేతనాల పెంపు సాధ్యమవుతుందని దిల్ రాజు వివరించారు.
వేతనాల పెంపు ప్రతిపాదనలు
నిర్మాతలు వేతనాల పెంపు కోసం రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలకు రూ. 2,000 కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ, ఆపై వేతనం తీసుకునే వారికి మరొక పర్సంటేజీ పెంచాలని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఫెడరేషన్ లోని అన్ని యూనియన్లతో చర్చించి ఒకే తాటిపైకి వస్తేనే సమస్య పరిష్కారమవుతుందని దిల్ రాజు అన్నారు.
సానుకూలంగానే చర్చలు
బుధవారం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నాలుగు గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. దిల్ రాజు మాట్లాడుతూ “ప్రస్తుతం చర్చలు సానుకూల ధోరణిలో జరుగుతున్నాయి. కార్మిక సంఘాలు అన్ని యూనియన్లతో చర్చించి వస్తే, ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ అంశంపై ఇంకా రెండు, మూడు సార్లు చర్చలు జరపాల్సి ఉంది” అని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఇరు వర్గాలూ కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.