డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మరియూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు చెప్తున్నదాన్ని బట్టి త్వరలో హెచ్1బీ వీసాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎంత మందికి వీసాలు ఇవ్వాలి? మినిమమ్ శాలరీ ఎంత ఉండాలి? అనేదానిపై అతి త్వరలోనే కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కరోనా దెబ్బకి అమెరికా ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడిపోయింది. లక్షలాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయల ఉద్యోగులపై పడుతున్నాడు. అందులో భాగంగా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయ యువకుల ఆశలను ఆవిరిచేసే వరస ప్రకటనలు చేస్తూ వస్తున్నాడు. అమెరికా వెళ్ళడానికి టెకీలు ఉపయోగించే పాపులర్ వర్క్ వీసా హెచ్1 బీ పై డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చట్టబద్దమైన వలసలను అరికట్టడంతో పాటు అమెరికా పౌరులకు సాఫ్ట్ వేర్ రంగంలో మరింత అవకాశాలను పెంచేందుకే ఈ నిర్ణయమంటూ షరామాములుగానే తన కారణం చెప్పారు ట్రంప్. ఆయన టార్గెట్ మాత్రం తక్కువ వీసాలు ఇవ్వడమే.. అందులో భాగంగా హెచ్1బీ వీసాలను తక్కువ సంఖ్యలో మాత్రమే జారీచేసేలా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. సంవత్సరంలో ఎన్ని హెచ్1బీ వీసాలు ఇవ్వాలి? కనీస వేతనం ఎంత ఉంటే వీసా ఇవ్వాలి? అనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు తెలిపారు.
హెచ్1బీ వీసాలపై గత 20 ఏళ్లలో చేసిన అత్యంత ముఖ్యమైన సంస్కరణ ఇది అని అమెరికా లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఆంక్షలు త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉందని మరో బాంబు పేల్చారు.
ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం సుమారు 85వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా జారీ చేసిన సవరణలు ప్రకారం ఆ సంఖ్యను పావు వంతుకి తగ్గిస్తున్నట్లు హోమ్‌ల్యాండ్ యాక్టింగ్ డిప్యూటీ సెక్రటరీ కెన్ కుసినెల్లి తెలిపారు. అందువల్ల మూడో వంతు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని వెల్లడించారు. ప్రతీ సంవత్సరం జారీ అయ్యే 85వేల హెచ్1 బీ వీసాల్లో సింహాభాగం భారతీయ పౌరులే దాదాపు 40 వేల వీసాలు పొందుతుంటారు. ఐతే ఈ వీసాలను అమెరికా తగ్గించనుండడంతో భారతీయ టెకీలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం గా కనిపిస్తుంది.
కరోనా నేపథ్యంలో హెచ్1బీ వీసా జారీలని రద్దు చేస్తూ జూన్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల పౌరుల స్థానంలో తక్కువ జీతాలకి వస్తున్నారు కదా అని విదేశీయులను నియమించే ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. కాగా.. అసలు ఈ హెచ్1 బీ ప్రోగ్రామ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ సమయంలో అమలు చేశారు. సాఫ్ట్ వేర్ రంగంలో నూతన వరవడి కోసం, ప్రత్యేకమైన ఉద్యోగాలు కోసం, క్వాలిఫైడ్ వర్కర్ల కోసం ఈ విధానాన్ని తెచ్చారు.