Tumbbad 2: రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘తుంబాడ్ 2’.. పెన్ స్టూడియోస్‌తో చేతులు కలిపిన సోహామ్ షా..
Tumbbad 2: భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన హారర్-ఫాంటసీ చిత్రంగా నిలిచిపోయిన ‘తుంబాడ్’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఈ వార్త సినీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా సీక్వెల్‌ను దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ‘తుంబాడ్’ నిర్మాత, నటుడు సోహమ్ షా, ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడాతో చేతులు కలిపారు. ‘RRR’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సీక్వెల్ మరింత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
‘తుంబాడ్’ విజయానికి కొనసాగింపు..
2018లో విడుదలైన ‘తుంబాడ్’ థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందకపోయినా, ఓటీటీలో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో ఇటీవలే దాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేశారు. ఈ రీ-రిలీజ్‌కు కూడా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు ‘తుంబాడ్’ మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు.
https://x.com/taran_adarsh/status/1971162375643644006
మరిన్ని ట్విస్టులు, మరింత లోతుగా కథనం..
‘తుంబాడ్ 2’ గురించి సోహమ్ షా మాట్లాడుతూ, “తుంబాడ్ 2తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించాలని కోరుకుంటున్నాం. ఈసారి కథనంలో మరిన్ని ట్విస్టులు ఉంటాయి. అత్యాశకు పోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మరింత లోతుగా, వివరంగా చూపించనున్నాం” అని తెలిపారు. ఈ ప్రకటనతో ‘తుంబాడ్’ అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. ఈ సీక్వెల్ కూడా మొదటి భాగాన్ని మించి అద్భుతాలు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.