Sisters Marriage పెళ్లి చేసుకున్న ‘అక్కాచెల్లెళ్లు’.. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి దుస్తుల్లో ప్రత్యక్షం
Sisters Marriage ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అదృశ్యమైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కొంతకాలం తర్వాత భార్యాభర్తలుగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో పోలీసులు, కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. తాము ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని, ఇకపై కలిసి జీవిస్తామని వారు స్పష్టం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కూతురును అమ్మేసి ఉంటారని ఆందోళన..
ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. తన కూతురును ఎవరైనా అమ్మేసి ఉంటారని అనుమానంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆ యువతి ఆచూకీ తెలుసుకున్నారు. తాము భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు రావడానికి అంగీకరించింది. అయితే, ఆమె ఒంటరిగా కాకుండా, బంధువైన మరో యువతితో కలిసి పోలీస్ స్టేషన్‌కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వివాహ దుస్తుల్లో పోలీస్ స్టేషన్‌కు…
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు పెళ్లి దుస్తుల్లో, మరొకరు నిండుగా సింధూరం పెట్టుకుని కనిపించారు. వారిని చూసి కుటుంబసభ్యులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. తాము పెళ్లి చేసుకున్నామని, ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండాలనుకుంటున్నామని వారు చెప్పారు. గత ఏడాదిన్నరగా తాము ప్రేమించుకుంటున్నామని, కుటుంబసభ్యులు తమ సంబంధాన్ని అంగీకరించకపోవడంతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు.
స్వలింగ వివాహాలకు గుర్తింపు ఉందా..?
పోలీసులు, కుటుంబసభ్యులు వారిని ఇంటికి తిరిగి వెళ్లాల్సిందిగా ఎంత నచ్చచెప్పినా వారు వినలేదు. కలిసి జీవించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. చట్ట ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని, అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్వలింగ సంబంధాలు నేరం కాదని పేర్కొన్నారు. యువతులు ఇద్దరూ మేజర్లు కావడంతో వారి నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇద్దరినీ పోలీస్ స్టేషన్ నుంచి సురక్షితంగా పంపించేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.