Upasana Konidela: 29వ ఏట ఎగ్ ఫ్రీజింగ్.. 39వ ఏట కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన కొణిదెల
Upasana Konidela: మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. కెరీర్‌పై దృష్టి సారించే మహిళలు, ఆర్థికంగా స్థిరపడేవరకూ పిల్లల బాధ్యతను వాయిదా వేయడానికి ‘ఎగ్ ఫ్రీజింగ్’ ఒక మంచి ఇన్సూరెన్స్ లాంటిదని ఉపాసన సూచించారు. దీనిపై వైద్య నిపుణులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కోట్లు ఉన్నవారికే ఇది సాధ్యమని, సామాన్యులకు కాదని పలువురు డాక్టర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజా వివాదంపై స్పందిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
తన వ్యాఖ్యల వల్ల దేశవ్యాప్తంగా అండాల సంరక్షణపై ఒక చర్చ జరగడం సంతోషకరమని ఉపాసన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను, విమర్శలను తాను గౌరవిస్తానని చెబుతూనే, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలను ఉదాహరణగా వివరించారు. “నేను 27 ఏళ్ల వయసులో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. కానీ కెరీర్, ఆరోగ్యం దృష్ట్యా 29 ఏళ్ల వయసులో నా అండాలను ఫ్రీజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నా.
ఆ తర్వాత మానసికంగా, ఆర్థికంగా సిద్ధమయ్యాక 36 ఏళ్ల వయసులో నా మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. ఇప్పుడు 39 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నాను” అంటూ తన పర్సనల్ జర్నీని బయటపెట్టారు. పెళ్లి, కెరీర్ అనేవి రెండూ ముఖ్యమేనని, అయితే వాటికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవడం తన హక్కు అని ఆమె స్పష్టం చేశారు.
ఉపాసన సూచనపై పలువురు ప్రముఖ గైనకాలజిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్, ఐవీఎఫ్ (IVF) వంటి పద్ధతులు చెప్పినంత సులభం కాదని వారు హెచ్చరిస్తున్నారు. వీటికి ఏటా లక్షల్లో ఖర్చు అవుతుందని, బ్యాంకుల్లో కోట్లు నిల్వ ఉన్నవారికి మాత్రమే ఇలాంటి సలహాలు ఇవ్వడం సులువని ఒక డాక్టర్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా అండాలను ఫ్రీజ్ చేసినంత మాత్రాన భవిష్యత్తులో గర్భం దాల్చడం గ్యారెంటీ కాదని, ఇందులో జీవసంబంధమైన పరిమితులు చాలా ఉంటాయని వైద్య నిపుణులు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు మహిళా ఉద్యోగులకు కంపెనీలు అండగా నిలవాలని ఉపాసన కోరారు. ఐఐటీ విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో.. పెళ్లి గురించి అడగ్గా అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ ఆసక్తి చూపడం ప్రగతిశీల భారత్‌కు నిదర్శనమని ఆమె కితాబిచ్చారు. ఏది ఏమైనా, ఉపాసన లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్తోమత, సంతాన సాఫల్య చికిత్సల చుట్టూ కొత్త చర్చకు తెరలేపింది.
