Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చేసిన ఒక భావోద్వేగపు పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి. తనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది తన వారసత్వం గానీ, వివాహ బంధం గానీ కాదని, అనేక ఒత్తిళ్లు, కష్టాలను ఎదుర్కొని తన సొంత ప్రతిభతో ఈ స్థాయికి ఎదిగానని ఉపాసన స్పష్టం చేశారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే ఆలోచనను పంచుకున్న ఉపాసన, నిజమైన గొప్పతనం దేనితో వస్తుంది? అనే ప్రశ్నను లేవనెత్తారు. డబ్బు, హోదా, కీర్తి మాత్రమే గొప్పతనానికి ప్రమాణాలా? లేక భావోద్వేగ స్థిరత, ఇతరులకు సేవ చేయాలనే తపన కూడా అంతే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. “నేను ఎవరి దయతో ఎదగలేదు. ఎన్నోసార్లు కిందపడ్డాను, కానీ ప్రతిసారీ మళ్లీ లేచి నిలబడ్డాను. ఒత్తిడిని, అణచివేతను ఎదుర్కొన్నాను. నా మీద నాకే నమ్మకం!” అని ఉపాసన తన మనసులోని మాటను బయటపెట్టారు.
అసలైన బలం ఆత్మగౌరవంలోనే..
ఆత్మగౌరవం అనేది ఎంతో ముఖ్యమైనదని ఉపాసన నొక్కి చెప్పారు. “అసలైన బలం ఆత్మగౌరవంలో ఉంటుంది. దానికి డబ్బు, హోదా, కీర్తి వంటి వాటితో సంబంధం లేదు. అహంకారం గుర్తింపు కోసం అరుస్తుంది, కానీ ఆత్మగౌరవం మౌనంగానే తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుంటుంది” అని ఆమె చెప్పిన మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి.
https://www.instagram.com/p/DNulD4wZnY1/?utm_source=ig_web_copy_link
అన్ని బాధ్యతలూ నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా..
అపోలో గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, ఒక తల్లిగా ఉపాసన ఎన్నో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ఆమె, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సందేశాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.