Upcoming Movies: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ప్రేక్షకులకు పండగే
Upcoming Movies: గత వారం బాక్సాఫీసు వద్ద ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం కూడా సినీ ప్రియులను ఆకట్టుకోవడానికి మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలతో పాటు, ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
దక్ష (Daksha): నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తూ, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో లక్ష్మి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని, చిత్ర శుక్లా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
బ్యూటీ (Beauty): నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు నరేశ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
అందెల రవమిది (Andela Ravamidi): ‘స్వర్ణకమలం’ చిత్రం స్పూర్తితో రూపొందించిన ఈ చిత్రానికి ఇంద్రాణి దావలూరి కథానాయికగా నటించి, దర్శకత్వం వహించారు. సంగీతం, నృత్యం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.
భద్రకాళి (Bhadrakaali): ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన 25వ సినిమా ఇది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో త్రుప్తి రవీంద్ర హీరోయిన్. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
వీర చంద్రహాస (Veera Chandrahasa): ‘కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు రవి బస్రూర్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రం ఇది. కన్నడలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల కానుంది. యక్షగానం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరవనున్నారు.
జాలీ ఎల్.ఎల్.బి 3 (Jolly LLB 3): బాలీవుడ్ లో విజయవంతమైన ‘జాలీ ఎల్.ఎల్.బి’ ఫ్రాంచైజీ లో మూడవ భాగం ఇది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ డ్రామా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టులు
ఈ వారం పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘పోలీస్ పోలీస్’, ‘ది ట్రయల్ 2’ వెబ్ సిరీస్ లు సెప్టెంబర్ 19న స్ట్రీమింగ్ కానున్నాయి. అదే రోజున జీ 5 లో ‘హౌస్ మేట్స్’ సినిమా అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 18న ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’, ‘ప్లాటోనిక్’ వెబ్ సిరీస్ లు, సెప్టెంబర్ 19న ‘బిలియనీర్స్ బంకర్’, ‘హాంటెడ్ హాస్టల్’, సెప్టెంబర్ 20న ’28 ఇయర్స్ లేటర్’ స్ట్రీమింగ్ కానున్నాయి.