Mahavatar Narsimha: బాక్సాఫీస్ వద్ద ‘మహావతార్ నర్సింహా’ అద్భుత విజయం..!
Mahavatar Narsimha: కన్నడలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నర్సింహా’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను విపరీతంగా పొందుతోంది. ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది.
ప్రభుత్వం నుంచి ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మహావతార్ నర్సింహా’ చిత్ర బృందాన్ని అభినందిస్తూ, “భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను పరిరక్షించేందుకు మీరు చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొంది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు, క్లీమ్ ప్రొడక్షన్స్ సహకారంతో హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇది విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో తొలి భాగం.
రికార్డు స్థాయి వసూళ్లు
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ యానిమేటెడ్ చిత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ట్రేడ్ నిపుణుల ప్రకారం, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ రూ. 30 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, భారీ లాభాలను ఆర్జించింది. భారత్‌లో ఈ సినిమా నెట్ వసూళ్లు రూ. 195 కోట్లు కాగా, గ్రాస్ వసూళ్లు రూ. 225 కోట్లు. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 15 కోట్లు వసూలు చేసింది. తాజాగా విడుదలైన ‘వార్ 2’, ‘కూలీ’ వంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, ‘మహావతార్ నర్సింహా’ మంచి వసూళ్లను సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
కన్నడలో రూ.6 కోట్లు, తెలుగులో రూ.38 కోట్లు, హిందీలో రూ.139 కోట్లు, తమిళంలో రూ.2.50 కోట్లు, మలయాళంలో రూ.50 లక్షల ఇండియా నెట్ వసూల్ చేయడం విశేషం. ఇప్పటి వరకు 240 కోట్ల గ్రాస్ వసూల్ కాగా.. ఇందులో 210 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ అందడం విశేషం.