Varun Tej- Lavanya Tripathi: మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు.. తల్లిదండ్రులైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
Varun Tej- Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 1, 2023న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట, నిశ్చితార్థంతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంట తాజాగా తమ అభిమానులకు మరో శుభవార్తను అందించింది.
కొద్ది రోజుల క్రితం, తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామని వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా, ఈ రోజు ఉదయం లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో లావణ్య ప్రసవించారని సమాచారం. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లివిరిసింది.
‘శంకర వరప్రసాద్’ సెట్ నుంచి హాస్పిటల్‌కు చిరంజీవి..
ఈ శుభవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, తాను నటిస్తున్న ‘శంకర వరప్రసాద్’ సినిమా సెట్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్ళారు. వరుణ్ తేజ్, లావణ్యలను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మెగా కుటుంబానికి కొత్త వారసుడు రావడంతో సోషల్ మీడియాలో అభిమానుల సందడి మొదలైంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మొదటిసారిగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని సమాచారం. చాలా కాలం పాటు తమ ప్రేమ బంధాన్ని రహస్యంగానే ఉంచిన ఈ జంట, ఇప్పుడు తమ జీవితంలో కొత్త దశను ప్రారంభించారు. ఈ వార్తతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.