Vayuputra: ‘వాయుపుత్ర’ నాగవంశీ ప్రొడక్షన్‌లో మైథలాజికల్ మూవీ..!
Vayuputra: పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహా’ ఘన విజయం సాధించడంతో, దర్శక నిర్మాతలు ఈ తరహా కథలపై దృష్టి సారించారు. ఈ కోవలోనే, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
‘వాయుపుత్ర’ (Vayuputra) పేరుతో రూపొందుతున్న ఈ యానిమేషన్ చిత్రానికి ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదని, ఒక గొప్ప పవిత్ర దృశ్య కావ్యమని నాగవంశీ అభివర్ణించారు. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం హనుమంతుడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాల గురించి నాగవంశీ మాట్లాడుతూ, “మన చరిత్ర, ఇతిహాసాలు, పురాణాల్లోని గొప్ప కథతో ఇది వస్తోంది. 3D యానిమేషన్‌లో ఒకేసారి 5 భాషల్లో విడుదలవుతుంది” అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నాగవంశీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మైథలాజికల్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. “త్రివిక్రమ్ మొదటిసారిగా మైథలాజికల్ సినిమాను తీస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశాం. ఇప్పుడు తారక్‌ను నేను అలా చూపించనున్నా. వచ్చే ఏడాది మధ్యలో దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం” అని ఇటీవల నాగవంశీ చెప్పారు. అయితే ఇప్పుడు ప్రకటించిన ‘వాయుపుత్ర’ చిత్రం అంతకంటే ముందే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీనితో సినీ ప్రియులలో ఉత్కంఠ మరింత పెరిగింది.
