Venkatesh Trivikram: వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ లీక్.. ‘బంధుమిత్రుల అభినందనలతో..’ వెనుక అసలు కథ!
Venkatesh Trivikram: విక్టరీ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన తర్వాత దాదాపు దశాబ్దాలు గడిచి, ఇప్పుడు మరోసారి ఫుల్ లెంగ్త్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన టైటిల్ లీక్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
త్రివిక్రమ్ మార్కుకు తగ్గట్టుగా, తెలుగుదనం గుబాళించేలా ఈ సినిమాకు ‘బంధుమిత్రుల అభినందనలతో..’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి పత్రికలపై తరచూ కనిపించే ఈ అందమైన అచ్చతెలుగు టైటిల్‌ను త్రివిక్రమ్ టీమ్ దాదాపుగా ఖరారు చేసిందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడిగా మారిన రచయిత కావడంతో త్రివిక్రమ్ తన సినిమాలకు తెలుగుదనం ఉట్టిపడేలా, సాహిత్యం నిండిన టైటిల్స్‌ను ఎంచుకోవడం ఆయన శైలి. ఈ టైటిల్ ద్వారా ఈ చిత్రం ఎలాంటి జానర్‌లో రూపొందుతుందో చెప్పకనే చెబుతున్నారని సినీ పండితులు అంటున్నారు. ఇది రక్తపాతాలు, బాంబుల శబ్దాలు లేని, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందని, వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే ఈ మ్యాజిక్‌ను ప్రేక్షకులు మళ్లీ కొన్నేళ్లపాటు గుర్తుంచుకుంటారని చిత్రవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్/సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మిడ్ డిసెంబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా పాట షూటింగ్‌లో ఉన్న వెంకటేశ్, ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నారట. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు, త్రివిక్రమ్ త్వరలో అల్లు అర్జున్‌తో మైథలాజికల్ ఫిల్మ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
