Venky77: మాటల మాంత్రికుడు, వెంకీ మామ కాంబోలో కొత్త సినిమా..!
Venky77: ఈ ఏడాది ప్రారంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు వెంకటేష్, అదే ఊపులో తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టారు. వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా, పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
వెంకటేష్ ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో పూర్తిస్థాయి సినిమా రావడం ఇదే మొదటిసారి. గతంలో వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఇప్పుడు వీరిద్దరూ దర్శకుడు, హీరోగా కలిసి పనిచేస్తుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
సినిమా విశేషాలు..
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ‘మిస్టర్ వెంకటేశం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని, ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ వంటి నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
వెంకటేష్ ఇతర ప్రాజెక్టులు..
ఈ చిత్రంతో పాటు వెంకటేష్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే ‘మెగా 157’ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే, ‘దృశ్యం 3’తో మరోసారి థ్రిల్ అందించనున్నారు. ఇటీవల ఆయన ఓ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ ప్రాజెక్టులన్నీ వెంకటేష్ అభిమానులకు పండగే అని చెప్పాలి.
