Venky Vinayak: వెంకీ-వినాయక్ కాంబోలో మరో మాస్ సినిమా..!
Venky Vinayak: సీనియర్ కథానాయకుడు వెంకటేష్ తన తదుపరి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి విజయం సాధించిన వెంకీ, ఆ ఊపును కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వినాయక్‌తో మరోసారి..
త్రివిక్రమ్ సినిమాతో పాటు, వెంకటేష్ ఇతర దర్శకులతో కూడా కథా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘లక్ష్మి’ దర్శకుడు వి.వి. వినాయక్, మరోసారి వెంకీ కోసం ఒక మాస్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను వినాయక్ త్వరలోనే వెంకటేష్‌కి వినిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
19 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్
2006లో విడుదలైన ‘లక్ష్మి’ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని వార్తలు వచ్చినా, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుందన్న వార్తలు వెంకీ అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రం కూడా ‘లక్ష్మి’ తరహాలోనే మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జానర్‌లో ఉండనుందని సమాచారం.
గత కొంతకాలంగా వినాయక్ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. ‘ఇంటెలిజెంట్’ నిరాశపరచగా, హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్‌తో సినిమా కనుక ఓకే అయితే, వినాయక్‌కు ఇది ఒక బలమైన పునరాగమనంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
