Vidhyuth Employees Strike: విధ్యుత్ శాఖలో మోగిన సమ్మె సైరన్… ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ
తెలంగాణా విధ్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణ, ఆర్టిజన్ ల అంశం తో పాటు ధీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విధ్యుత్ శాఖ సిబ్బంది, కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా సమ్మెకు వెళ్లాలని తెలంగాణా రాష్ట్ర విధ్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (TSPJAC) నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 17 వ తేదీ ఉదయం 8 గంటల నుండి సమ్మె లోకి దిగుతున్నట్లు తెలంగాణా రాష్ట్ర విధ్యుత్ జేఏసీ స్పష్టం చేసింది. ఈ మేరకు జేఏసీ లో భాగస్వామ్యం అయిన యూనియన్లు అన్నీ కలిసి జేఏసీ పక్షాన టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో యాజమాన్యాలకు తాజాగా సమ్మె నోటీసులు అందించాయి. తమ వేతనాల అంశం సంవత్సర కాలంగా పెండింగ్ లో ఉందని, ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని జేఏసీ నోటీసులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే విడతల వారీగా జిల్లా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు చేసిన విధ్యుత్ ఉద్యోగులు, గత నెల 24 న ఖైరతాబాద్ వద్ద గల విధ్యుత్ ప్రధాన కార్యాలయం ముందు మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి విధ్యుత్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ తదనంతర రోజుల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి కదలిక, స్పందన లేకపోవడంతో చివరి అస్త్రంగా ఈ ఏప్రిల్ 14 నుండి సమ్మె చేయాలని నిర్ణయించాయి.