Bhadrakali: పొలిటికల్ సస్పెన్స్ డ్రామా.. ఆసక్తిగా విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ ట్రైలర్
Bhadrakali: సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ, తన తాజా చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakali) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాపై అంచనాలను పెంచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే, ‘భద్రకాళి’ ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందినట్లు తెలుస్తోంది.
ఈ ట్రైలర్‌లో అవినీతి, అధికారం, డబ్బు చుట్టూ అల్లుకున్న రాజకీయ నేపథ్యాన్ని చూపించారు. ఒక సాధారణ వ్యక్తి ఎలా మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేశాడనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆసక్తిని పెంచారు. ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా, మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా, ఇంకోసారి ప్రభుత్వ అధికారిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వందల కోట్ల స్కామ్‌కు హీరో పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? అసలు విజయ్ ఆంటోనీ పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతున్నాయి.
ట్రైలర్‌లోని విజువల్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. విజయ్ ఆంటోనీ స్వరపరిచిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు.
‘భద్రకాళి’ గురించి మరికొన్ని విశేషాలు..
ఈ చిత్రానికి కథానాయకుడిగా విజయ్ ఆంటోనీ నటిస్తూనే, సంగీత దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా పంపిణీ చేస్తున్నాయి. ఈ సినిమా విజయం సాధించి విజయ్ ఆంటోనీకి మరింత పేరు తెస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.