Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ‘మమ్మీ’ విలన్.. పెద్ద ప్లానే..
Vijay Devarakonda: ఇటీవలి కాలంలో విజయాలు దక్కించుకోలేక ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో, విజయ్ ఇప్పుడు తన కొత్త సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా వెలువడింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూను ఎంపిక చేశారు. ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ చిత్రాలతో భారతీయ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆర్నాల్డ్, ఈ సినిమాతో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆర్నాల్డ్ ఇప్పటికే సెట్‌లో అడుగుపెట్టారని, ఆయన పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా రాహుల్ సంకృత్యన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ మంచి విజయం సాధించింది. దీంతో ఈ కొత్త సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో, రాయలసీమ ప్రాంతంలో జరిగే కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ, రష్మిక మూడవసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గతంలో వీరిద్దరూ నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, ‘డియర్ కామ్రేడ్’ నిరాశపరిచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఎంట్రీతో ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు ఒక మలుపు అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.