Vijay Rashmika: విజయ్-రష్మిక కాంబోలో మరో సినిమా.. ఈ హిట్ పెయిర్ మరో హిట్ కొడుతుందా?
Vijay Rashmika: వెండితెరపై హిట్‌పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు మూడోసారి ఒకే సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైందని సినీ వర్గాల సమాచారం.
గత ఆరేళ్లుగా ఈ ఇద్దరు తారలు కలిసి ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే, ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ చిత్రాన్ని అందించారు.
‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. 1870ల నాటి రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో వారిద్దరి మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో ఈ కొత్త చిత్రంపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు, రష్మిక మందన్న పాన్-ఇండియా సినిమాలతో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తెరపైకి రానున్న ఈ హిట్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉందని మేకర్స్ తెలిపారు.