Kingdom Movie: ‘కింగ్డమ్’ ఖాతాలో మరో రికార్డు.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి విజయ్ దేవరకొండ సినిమా
Kingdom Movie: యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. జూలై 31న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టింది. ఇప్పుడు, ఈ సినిమా ఒక మైలురాయిని చేరుకుంటూ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
‘కింగ్డమ్’ సాధించిన ఈ విజయం విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. ఇప్పటికే ఆయన నటించిన ‘గీత గోవిందం’ (రూ.130 కోట్లు) చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను దాటగా, ఇప్పుడు ‘కింగ్డమ్’తో ఈ రికార్డును రెండోసారి సాధించిన హీరోగా విజయ్ నిలిచారు. యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీ భోర్సే నటించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే, సూరి (విజయ్ దేవరకొండ) అనే ఒక కానిస్టేబుల్ తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతూ శ్రీలంకలోని గ్యాంగ్‌ను పట్టుకోవడానికి అండర్‌కవర్ ఏజెంట్‌గా మారతాడు. తన అన్న ఎందుకు ఇల్లు వదిలి వెళ్లాడు, శ్రీలంకలో ఏం చేస్తున్నాడు అనే విషయాలను సూరి ఎలా కనుక్కున్నాడు అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ సినిమాలోని థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్డమ్’ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ మార్కెట్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.
‘కింగ్‌డమ్ 2’పై ఆసక్తికర అప్డేట్స్
‘కింగ్డమ్’ విజయం పట్ల సంతోషంగా ఉన్న చిత్రబృందం, త్వరలోనే ‘కింగ్డమ్ 2’ అంటూ నిర్మాత నాగవంశీ కొన్ని రోజుల క్రితం జరిగిన కింగ్డమ్ సక్సెస్ మీట్‌లో హింట్ కూడా ఇచ్చారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తైన తరువాతే సీక్వెల్ ప్లాన్ చేస్తామని నాగవంశీ వెల్లడించారు. మొదటి భాగం క్లైమాక్స్‌లో చూపించిన ‘సేతు’ అనే కీలక పాత్రను ఒక స్టార్ హీరో పోషించనున్నారని, ఆ విషయంలో పెద్ద సర్ప్రైజ్ ఉందని నాగవంశీ పేర్కొన్నారు.
