Vishwambhara Story Leak: ‘విశ్వంభర’ కథను లీక్ చేసిన డైరెక్టర్..
Vishwambhara Story Leak: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు ఓ హిట్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఆ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా, దర్శకుడు వశిష్ఠ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమా కథాంశంపై కీలకమైన హింట్ ఇచ్చారు. మొదటి నుంచీ ‘విశ్వంభర’ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వశిష్ఠ కూడా ఈ వార్తలను పరోక్షంగా ధృవీకరించారు.

‘విశ్వంభర’ కథ ఇదేనా?
వశిష్ఠ మాట్లాడుతూ, “మనకు మొత్తం 14 లోకాలుంటాయి. కింద 7, పైన 7. స్వర్గం, పాతాళం, యమలోకం వంటి వాటికి ప్రధానమైన లోకం సత్యలోకం, అదే బ్రహ్మ లోకం. ఇప్పటివరకూ చాలామంది దర్శకులు తమకు నచ్చిన విధంగా వివిధ లోకాలను చూపించారు. నేను ఇప్పుడు సత్యలోకాన్ని చూపించబోతున్నాను. ‘విశ్వంభరా’ అంటే విశ్వాన్ని భరించేది. ఈ సినిమాలో హీరో 14 లోకాలను దాటి వెళ్లి, అక్కడ ఉన్న హీరోయిన్‌ను కలుసుకుంటాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా భూమికి తీసుకొచ్చాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం” అని వివరించారు.

భారీ సెట్‌లతో కనుల పండుగ!
‘విశ్వంభర’ సినిమా కోసం ఇప్పటికే భారీ బడ్జెట్‌తో సత్యలోకం సెట్‌ను నిర్మించినట్లు వశిష్ఠ తెలిపారు. ఇది ప్రేక్షకులకు కనుల పండుగగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వశిష్ఠ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
