Vladimir Putin: భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం.. వాటి కోసంం రష్యాలో స్పెషల్ ఛానల్ ఉంది: పుతిన్
Vladimir Putin: భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన దౌత్య, రాజకీయ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న నేపథ్యంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా, ఇండియన్ సినిమాలంటే తనకు, తన దేశ ప్రజలకు ఎంతో ఇష్టమని ఆయన వెల్లడించారు. భారతదేశం నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ, భారత్‌తో తమ బంధం మరింత గట్టిపడుతోందని ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా తెలిపారు.
నల్లసముద్రంలోని రిసార్ట్ నగరం సోచిలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ, భారతీయ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “భారత దేశమంటేనే కాదు, భారతీయ సినిమాలంటే మాకు చాలా ఇష్టం. అందుకే రష్యాలో ఇండియన్ ఫిల్మ్స్‌ను ప్రసారం చేయడానికి ప్రత్యేక టెలివిజన్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాం. రాత్రి, పగలు తేడా లేకుండా ఈ ఛానెల్ కేవలం భారతీయ చిత్రాలను మాత్రమే ప్రసారం చేస్తుంది,” అని ఆయన అన్నారు. భారతీయ సినిమాల కోసం ప్రత్యేక టీవీ ఛానెల్ ఉన్న ఏకైక దేశం రష్యానే కావొచ్చని పుతిన్ అభిప్రాయపడ్డారు.
రష్యా-భారత్ బంధం కేవలం రాజకీయ, దౌత్య పరంగానే కాకుండా, సాంస్కృతిక, మానవతా పరంగా కూడా చాలా బలంగా ఉందని పుతిన్ నొక్కి చెప్పారు. రష్యాలో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారని, భారతీయ సంస్కృతి, సినిమాలపై రష్యన్లకు ఎంతో ఆసక్తి ఉందని ఆయన వివరించారు.
సోవియట్ కాలం నుంచే రష్యాలో భారతీయ చిత్రాలకు అపారమైన ఆదరణ ఉంది. రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ బాలీవుడ్ తారల పేర్లు రష్యాలోని ప్రతి ఇంట్లో వినిపించేవట. ముఖ్యంగా, 1982లో విడుదలైన మిథున్ చక్రవర్తి బ్లాక్‌బస్టర్ చిత్రం ‘డిస్కో డాన్సర్’ సోవియట్ యూనియన్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. పుతిన్ వ్యాఖ్యలు భారత్-రష్యా సాంస్కృతిక సంబంధాల లోతును మరోసారి తెలియజేశాయి.
