Water Conflict at Nagarjuna Sagar : నాగార్జునసాగర్ వద్ద ఇంకా తీవ్ర ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. తెలంగాణలో ఎన్నికలవేళ నాగార్జునసాగర్ వ్యవహారం బయటికి రావడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. అసలు దీనికి సంబంధించిన గొడవకు గల కారణాలేమిటో తెలుసుకుందాం..
నాగార్జునసాగర్ కు మొత్తం 26 గేట్లు ఉండగా, దాంట్లో 13 నుండి 26 గేట్లను ఏపీ తమ ఆధీనంలో ఉంచింది. 13వ డేట్ వద్ద కంచెను ఏర్పాటు చేసి సాగర్ కుడి కాలువకు ఈ గేటు నుండి నీటిని తరలించింది. ఏపీ ఇలా వ్యవహరించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీటి గొడవలు జరగడం, అది కూడా ఎన్నికల సమయంలో ఇలా జరగడం గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టిని సారించింది.
రివర్ బోర్డు సభ్యులు డ్యామ్ వద్దకు చేరుకొని ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతున్నారు. గురువారం రోజున 13 గేట్లను తమ నియంత్రణలోకి ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అయితే తెలంగాణ అనుమతి లేకుండానే ఇప్పటివరకు మొత్తంగా 4000 క్యూసెక్కుల నీటిని విడుదల కూడా చేసేసింది. తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని వాడుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్క ప్రకారం సాగర్ లో 52 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 12 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది.
అసలు గొడవేంటి?
ఏపీ, తెలంగాణ విభజన సమయంలోనే కృష్ణ, గోదావరి నది బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్ర, నాగార్జునసాగర్ ను తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించాలి అని రూల్ పెట్టారు.. అయితే ఈ నిబంధనను ఎవరు సరిగా అమలు చేయడం లేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అటు ఏపీ అధికారులను రానివ్వడం లేదు. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణనే చూసుకుంటుంది.
కుడి కాలువ నుండి ఏపీకి నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే ఇదివరకు కృష్ణ బోర్డు చెప్పినప్పటికీ నీళ్లను విడుదల చేయని సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి సమస్యలు ఏమి ఏర్పడలేదు. ఏపీ కూడా సాగర్ కుడి కాలువ నీళ్లు విడుదల చేయమని అడగలేదు.
కానీ ఊహించని విధంగా ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ దగ్గరికి వచ్చి 13 గేట్ లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశారో, ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. తెలంగాణ అధికారులు అడగకుండానే వారు నీటిని కూడా విడుదల చేసేసుకున్నారు. అక్కడ ఆ కారణం చేత ఉధృత పరిస్థితి నెలకొంది. ఇలా ప్రవర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇప్పటికే విజయపురి పోలీస్ స్టేషన్ లో ఏపీ పోలీసుల పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించింది.