మహానుభావుల స్మరణలో జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో నాయకులు అంటే ఎన్టీఆర్ వై ఎస్ ఆర్ మాత్రమే గుర్తు రావడం సహజం. ఎందుకు అంటే ఎక్కడ చూసినా వీళ్ళ ఇద్దరి విగ్రహాలు.. ఏ పథకానికి చూసినా ఈ ఇద్దరి పేర్లు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు గాని వాళ్ల స్మరణ గాని ఉండదు. తమ తండ్రి, తాత, బంధువుల సేవలను ప్రజలు గుర్తించాలి అనుకోవడం తప్పేం కాదు గాని వారికి ఇచ్చిన గౌరవం లో కనీసం పదో వంతు అయినా వివిధ విభాగాల్లో సేవలందించిన మహానుభావులకు కూడా ఇవ్వాలి కదా..? అలా స్మరించుకోవడమే మనం వాళ్లకు ఇచ్చే గౌరవం.. ఈ విషయంలో మాత్రం కచ్చితంగా జనసేన ను అభినందించి తీరాల్సిందే..
ఈ రోజు శ్రీ CK నాయుడు గారి 125వ జయంతి.. ఆయన కు నివాళులు తెలుపుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక లెటర్ విడుదల చేసారు..అది యదాతధం గా…
తెలుగువారికి ఖ్యాతి తెచ్చిన శ్రీ సి.కె.నాయుడు గారు చిరస్మరణీయులు. క్రికెట్ అంటే మక్కువ చూపని భారతీయులు బహు అరుదుగా ఉంటారు. నేడు అధిక సంఖ్యాక భారతీయ యువత క్రికెట్ అంటే మైమరచిపోతారు. మన జీవితాలపై ఇంతటి ప్రభావాన్ని చూపుతున్న క్రికెట్ అనే పుస్తకానికి ముఖ చిత్రం మన తెలుగు బిడ్డడే. ఆయనే సి.కె.నాయుడు గా ప్రసిద్ధి చెందిన శ్రీ కొఠారి కనకయ్య నాయుడు గారు. ఆయన మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో తెలుగు కుటుంబంలో జన్మించారు. నేడు ఆయన 125వ జయంతి.
ఆయన తాత ముత్తాతలు కృష్ణా జిల్లా మచిలీపట్టణం నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లారు. శ్రీ సి.కె.నాయుడు గారి తండ్రి శ్రీ సూర్యప్రకాష్ గారు తండ్రి హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తూ నాగపూర్ లో స్థిరపడడంతో శ్రీ సి.కె.నాయుడు గారు అక్కడ జన్మించారు. తెలుగు ఖ్యాతిని క్రీడా ప్రపంచంలో నలుదిశలా వ్యాపింపచేసిన శ్రీ నాయుడు గారికి అయన జయంతి సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాను.
భారత టెస్ట్ క్రికెట్ కు ఆయన తొలి కెప్టెన్ కావడం మన తెలుగువారందరికీ గర్వ కారణం. ఆయన క్రికెట్ క్రీడలో సాధించిన విజయాలు ఎంత పొగిడినా తక్కువే. ఆల్ రౌండర్ అయిన శ్రీ నాయుడు గారు సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్ గా చెబుతారు. అయిదు దశాబ్దాలపాటు క్రికెట్ లో రాణించడం ఆయనకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు.
62 ఏళ్ల వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడి అర్ధ సెంచరీ సాధించడం ఊహకు అందని విషయం. ఆయన శారీరక పటిమకు తార్కాణం. శ్రీ సి.కె.నాయుడు గారు పుట్టింది మహారాష్ట్రలోనైనా ఆయన తుది శ్వాస విడిచే వరకు తెలుగు సంప్రదాయాలను, పద్ధతులను పాటించారు. అటువంటి గొప్ప క్రీడాకారుడు మన తెలుగువాడు కావడం మన అందరి అదృష్టం.
ఇట్లు
పవన్ కళ్యాణ్