మనిషి ఆహారపు అలవాట్లలో పెరుగు ముఖ్య భాగంగా మారిపోయింది. పెరుగుని ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నం చివరలో కొంతైనా పెరుగన్నం లేకపోతే భోజనం చేసినట్టే ఉండదు. ఇక కమ్మటి గడ్డ పెరుగేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడుతారు. ఆరోగ్య నిపుణులు మాత్రం అది ఒట్టి అపోహేనని కొట్టి పారేస్తున్నారు. పెరుగుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి అవేంటంటే..
- పెరుగు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- జలుబు, దగ్గు లాంటి సమస్యలు పెరుగుతాయని చాలామంది పెరుగు తినడం మానేస్తారు. కానీ, అలాంటి సమస్యలు తగ్గడానికి పెరుగే ఔషధమని నిపుణులు చెబుతున్నారు.
- చలికాలంలో కొంతమందిని మలబద్దకం సమస్య వేధిస్తుంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
- పెరుగులో కాల్షియం ఉంటుంది. దీనివల్ల శరీరంలోని కండరాలకు బలం చేకూరుతుంది. అంతేగాక ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా తయారవుతాయి. దంత సమస్యలు కూడా దూరమవుతాయి.
- పెరుగును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు (బీపీ)ని సైతం పెరుగు కంట్రోల్ చేస్తుంది.
- పెరుగును సాధ్యమైనంత వరకు పగటిపూట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు పెరుగు తింటే మ్యూకస్ పేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- ఆస్తమా సమస్య ఉన్నవారు మాత్రం రాత్రిళ్లు పెరుగును అసలే ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా రోగులు రాత్రిళ్లు పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుందంటున్నారు.