Who is the Chief Minister in Janasena and TDP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం, జనసేన పార్టీలలో మాత్రం ముఖ్యమంత్రి ఎవరనే విషయం ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. జనసేనతో అధికారాన్ని పంచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి పదవి పైన ఎటువంటి స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు.
ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ జన సైనికులకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము, పదవులు కాదు అని ఒక సంకేతాన్ని ఇస్తూ వచ్చారు. కానీ పార్టీ క్యాడర్ విస్తరించిన తరుణంలో పవన్ వాయిస్ ని చేంజ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి చంద్రబాబుతో చర్చించి చెప్తానని పవన్ మాట్లాడడమే దీనికి సాక్ష్యం. ఇవే మాటలను పవన్ కళ్యాణ్ వైజాగ్ సభలో మాట్లాడారు.
ఇంకా అప్పటినుంచి జనసేన నేతలకు అభిమానులకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఒకరకంగా జనసేన శ్రేణులను తిరిగి ట్రాక్లో తీసుకురావడానికి పవన్ ఇలాంటి బాణాన్ని సంధిస్తున్నాడని ఒక వర్గం చెప్పుకొస్తున్న, తెలుగుదేశం తరఫునుంచి పవన్ ఊహిస్తున్నట్టు ముఖ్యమంత్రి విషయంలో ఎటువంటి సంకేతాలు మాత్రం కనిపించకపోవడం గమనార్హం.
తెలుగుదేశం వైఖరిని స్పష్టం చేసే మరో సంఘటన కూడా చెప్పుకోవచ్చు. ఒంగోలు, బాపట్లలో తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తానంటూ మాట్లాడారు. ఎక్కడకూడా ఆయన పవన్ కళ్యాణ్ విషయం కాని, జనసేన విషయం కానీ ప్రస్తావించలేదు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు పొత్తుధర్మంపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన లక్ష్యంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నా కూడా, తెలుగుదేశం నుంచి మాత్రం పరిస్థితి క్రమంగా వేరే రకంగా మారుతుంది. మరోవైపు తెలుగుదేశానికి రాష్ట్రంలో మళ్లీ ప్రజలలో నమ్మకం పెరుగుతున్న క్రమంలో, ముఖ్యమంత్రి పదవిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రాలేని పరిస్థితులలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది.
తను ఊహించిన దానికి విరుద్ధంగా జరిగితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేస్తారా, లేకపోతే బిజెపితో పోత్తును కొనసాగించి వేరే పంథాను ఎన్నుకుంటారా, లేదో వేచి చూడాల్సిందే. ఎందుకంటే జనసేన పార్టీ నుండి పొత్తు కోసం ముందు పవన్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది.