రాష్ట్రంలో డిసెంబర్ 1వ తేదీ నుండి వైయస్సార్ బీమా అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గతంలో “చంద్రన్న బీమా” గా పిలిచిన ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వైసిపి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసి లబ్ధిదారునికి అందే బీమా సొమ్ము ని తగ్గించారు.
ఇప్పుడు మరలా పథకం లో మార్పులు చేర్పులు చేసి 18 నుండి 50 ఏళ్ల వయసు గల వారు సహజ మరణం పొందితే 2 లక్షల పరిహారం, 18 నుండి 50 ఏళ్ల వయసు కలిగిన వారు శాశ్వత అంగవైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల పరిహారం, అలాగే 51 ఏళ్ల మధ్య నుండి 70 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 3 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేసే విధంగా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం సుమారు 1 కోటి 50 లక్షల బియ్యం కార్డు కుటుంబాలకు వర్తింప చేయనున్నారు. దీనికై రాష్ట్రప్రభుత్వం ఏడాదికి 583 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు.
