Africa Ghana Village : గ్రామం ఎంత చిన్నది అయినా కూడా ఏదో ఒక రకం జంతువులు ఉంటూనే ఉంటాయి కదా. అలాగే ప్రతి గ్రామంలో స్మశానవాటిక కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా.. ఊర్లో ఎవరు చనిపోయినా స్మశానంలో దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. అలాగే.. ఇక ప్రతి గ్రామంలో కూడా మహిళలు ప్రసవించడం కనిపిస్తూనే ఉంటుంది కదా.. ఈ మూడు జరగని ఊరు ఈ ప్రపంచం మీద ఎక్కడ ఉండదని ఎవరైనా అనుకుంటారా.. కానీ ఉంది అదెక్కడో తెలుసా..
దక్షిణాఫ్రికాలోని ఘనాలో ఉన్న మాఫీడవ్ అనే ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింత గ్రామంగా పేరు ఉన్న గ్రామం. 5 వేల మంది జనాభాతో నిండి ఉంటుంది ఆ ఊరు. ఆ ఊర్లో ఏ ఒక్క మహిళ కూడా ప్రసవించదు, ఏ ఒక్కరు కూడా జంతువులను పెంచరు, ఏ ఒక్క శవాన్ని కూడా ఆ గ్రామంలో పూడ్చి పెట్టడం కానీ, కాల్చడం కానీ చేయరు.
అవునూ నిజమే..
ఇవన్నీ జరుగకుండా ఒక ఊరు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా! అవన్నీ జరుగుతాయి కానీ ఊరిలో కాదు. ఊరికి వెలుపల జరుగుతాయి. ఊరి లోపల మాత్రం అన్నీ బహిష్కారం అయినా బయట మాత్రం అన్నింటికీ అనుమతి ఉంటుంది. మహిళలు గర్భం దాల్చడం అక్కడ తప్పు కాదు.
కానీ గర్భవతి ఆ గ్రామంలో పిల్లలను ప్రసవించడం తప్పు, గర్భవతి 7 లేదా 8 నెలల గర్భం సమయంలో వేరే ఊరుకు ప్రసవం కోసం వెళ్లాల్సిందే. అక్కడ ప్రసవించిన తర్వాత పుట్టిన పిల్ల లేదా పిల్లాడికి బొడ్డు ఊడే వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత గ్రామంలోకి రావాల్సి ఉంటుంది.
ఇక ఆ గ్రామంలో జంతువులు అస్సలు కనిపించవు. కానీ గ్రామస్తులు సాధారణ జనాలు తిన్నట్లుగానే అన్ని రకాల జంతువుల మాంసాన్ని తింటారు. అది ఎలా అంటే..వేరే గ్రామాల నుండి మాంసాన్ని తెప్పిచ్చుకుంటారు. ఒకవేళ అదే గ్రామంలో జంతువులని కోయాలి అంటే మాత్రం ఆ రోజు తీసుకువచ్చి, అదే రోజు కొయ్యాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజుకు మించి జంతువులు ఆ గ్రామంలో ఉండకూడదు.
ఇక చనిపోయిన శవాల సంగతేంటి అనుకుంటున్నారా..!
పక్క గ్రామానికి తీసుకు వెళ్లి మరీ ఖననం చేస్తారు. ముందుగానే పక్క గ్రామాలతో ఒప్పందం చేసుకొని, డబ్బులు ఇచ్చి మరీ వేరే గ్రామాల్లో శవాలను పూడ్చి పెడుతూ ఉంటారు. కాదని వీటిని ఉల్లంఘిస్తే గ్రామ పెద్దల శిక్షకు అర్హులు అవుతారు.
అసలు ఇదంతా ఎందుకంటే..
చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామస్తుడికి దేవత ఈ విషయలు చెప్పడం వల్ల అప్పటి నుండి గ్రామంలో ఆ మూడు నిషేదించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మొత్తనికి చాలా వింతైనా గ్రామం కదా..!
Discussion about this post