ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా! పెరుగుతున్న పెట్రోల్ రేటుని అధిగమించేందుకు.. ప్రయాణికులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, ఈథర్‌తో మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో దూసుకుపోతున్నాయి. అయితే.. ఈ కంపెనీలు తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 80 వేలు నుంచి రూ. 1 లక్ష వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త స్టార్టప్.. ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చింది.
ఐఐటీ ఢిల్లీ బేస్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ బాజ్ బైక్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫర్డబుల్ ఇస్కూటర్ తీసుకువచ్చింది. అలాగే వీటిల్లో బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంతేకాకుండా వర్షం, దుమ్ము వంటి వాటికి ఇవి పాడవకుండా ఉండేందుకు వీటికి ఐపీ65 రేటింగ్ కూడా ఉంది. అంతేకాకుండా దీని రేటు కేవలం రూ. 35 వేలు మాత్రమే.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని కేవలం 90 సెకన్లలోనే మార్చొచ్చని కంపెనీ పేర్కొంటోంది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లో బ్యాటరీని మార్చుకుంటూ నాన్ స్టాప్‌గా ప్రయాణం చేయొచ్చు. బాజ్ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. దీని పొడవు 1624 ఎంఎ:, విడ్త్ 680 ఎంఎం, హైట్ 1052 ఎంఎం. అలాగే ఈ వెహికల్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌తో పని లేదు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
ఈ ఇ స్కూటర్ గరిష్ట స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఇందులో డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అందువల్ల స్కూటర్ స్మూత్‌గానే వెళ్తుంది. అంతేకాకుండా జనాలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతంలో మీరు మీ వెహికల్‌ను పార్క్ చేసినా సులభంగానే ఎక్కడ ఉందో గుర్తించొచ్చు. దీని కోసం ఈ స్కూటర్‌లో ఫైండ్ మై స్కూటర్ బటన్ ఫీచర్ ఇచ్చారు.