Earbuds : ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ఈరోజుల్లో ఎక్కువ అయిపోయింది. ఫోన్ ఎంతగా వినియోగిస్తున్నారో, ఫోన్ మాట్లాడడం కోసం ఇయర్ బడ్స్ కూడా అంతే మోతాదులో వినియోగిస్తున్నారు. ఇలా ఇయర్ బర్డ్స్ వాడడం ప్రమాదం అని నిపుణులు ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా చాలామంది వీటి వాడకం వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇయర్ బడ్స్ ని అవసరానికి మించి ఉపయోగిస్తే ప్రమాదాలు తప్పవు.. అవసరం మేరకే వాటిని వినియోగించాలని చెప్తున్నారు. అయితే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటివల్ల వినికిడి సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని గోర్కాపూర్ లో 18 ఏళ్ల యువకుడు ప్రతి రోజు విరామం లేకుండా ఇయర్ బడ్స్ ఉపయోగించడం వల్ల వినికిడి శక్తిని కోల్పోయాడు. యువత అందంగా, ఆకర్షణీయంగా తక్కువ ధరకు ఇయర్ బడ్స్ దొరుకుతుండడంతో వాటిని విరివిగా కొనుగోలు చేసి వాడుతున్నారు. ఇయర్ బడ్స్ ని గంటల తరబడి చెవిలో అలాగే ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని అతి కొద్దిరోజుల్లోనే వినికిడి శక్తిని కోల్పోతారని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా జరగడానికి ప్రధాన కారణం ఇయర్ బడ్స్ లో ఉండే ఇయర్ కెనాల్ లో తేమ పెరిగి, ఆ తేమలో బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్ కి దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే చెవి లోపలికి గాలి, వెలుతురు వెళ్లకుండా ఇయర్ బడ్స్ ని ఎక్కువసేపు చెవిలో పెట్టకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
మరీ ఇయర్ బడ్స్ ని ఎలా ఉపయోగించాలి..? వాటిని ఎక్కువసేపు వాడకూడదు. అలాగే ఇయర్ బడ్స్ యొక్క గరిష్ట శబ్దము 50 శాతానికి మించి ఉండకూడదు. చెవిలోపలికి పూర్తిగా ఇయర్ బడ్స్ వెళ్లకుండా బయటికి ఉండే హెడ్సెట్ లాంటివి ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రయాణాలలో వీటిని ఉపయోగించడం చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.