ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. నిద్రలేమితో భాద పడుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఫోన్ పక్కన ఉండాల్సిందే. టైం చూసే దగ్గర నుంచి మొదలుపెడితే గేమ్స్, సినిమాలు చూసే వరకు ప్రతి దానికి మొబైల్ ఉండాల్సిందే. అవసరానికి మించి వీటిమీద ఆధారపడిపోతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనుషులు బానిసలుగా మారిపోతున్నారు.
సరదా అయినా సంతోషమైనా, దుఃఖమైనా దానిని మనుషులతో కాకుండా పరికరాలతో పంచుకుంటున్నాం. కొత్త అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే.. ఎక్కువ సమయం మొబైల్ తోనే గడిపితే త్వరగా వృద్ధాప్యం వస్తుందట.. ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల చర్మం, మెదడు కణాలపై చెడు ప్రభావం చూపుతుందని తేల్చింది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌ల వంటి రోజువారీ పరికరాల నుండి వెలువడే బ్లూ లైట్‌ను అధికంగా వాడటం వల్ల హానికరమైన ప్రభావాలు వస్తాయట.
ఇవి కణాల నుండి న్యూరాన్ల వరకు మన శరీరంలోని జీవక్రియ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. నీలి కాంతిలో మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ప్రతి కణం పనితీరును పెరుగుదలను నియంత్రిస్తాయి. ఈ బ్లూ కిరణాలు మన శరీరం మీద పడటం వల్ల శరీరంలోని శక్తి కణాలు క్షీణిస్తాయి. నెమ్మదిగా వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి. గ్లుటామేట్ స్థాయిలు పెరిగి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి. దీంతో శరీరం మెదడు నీలి కాంతి ప్రభావంతో ఉత్సాహాన్ని కోల్పోతుంది.
