Interesting Facts : గుడికి మనం ఎందుకు వెళ్తాము, గుడిలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తాము. చనిపోయిన తర్వాత మన ఆత్మలకు శిక్షలు వేసే గుడి ఒకటి ఉందని మీకు తెలుసా? అలాగే యముడుకి ఒక గుడి, అలాగే చిత్రాగుప్తుడికి ఒక గుడి ఉండటం మీరు చూసారా..? విచిత్రంగా ఉంది కదా.. మనుషుల ప్రాణాలు తీసే వారికి గుడి ఉండటం ఏంటి అని.. కానీ అలాంటి గుడి కూడా ఉంది. అక్కడ కూడా భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేస్తారు, వెళ్లి దర్శనం కూడా చేసుకుంటారు.
అంత విచిత్రమైన, వింత అయిన గుడి ఎక్కడ ఉందంటే..
హిమాచల్ ప్రదేశ్‌లోని బర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయంలో ఆ దేవాలయం ఉంది. దాని పేరు “ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం”. అయితే ఈ దేవాలయం అన్ని గుడుల్లా కాకుండా ఒక ప్రత్యేకతను కలిగి, ఒక ఇల్లును పోలినట్టుగా ఉంటుంది.
ఆ ఇల్లులో రెండు గదులు వేరువేరుగా ఉంటాయి. అలా ఉండడానికి కూడా కారణం ఉంది. ఒక ఇంట్లో యమ ధర్మరాజు ఉంటాడని, ఇంకో ఇంట్లో చిత్రగుప్తుడు ఉంటాడని అందుకే రెండు వేరు వేరు గదులుగా విభజించారని చెబుతారు.
మనుషులు చనిపోగానే వారి ఆత్మలు యమలోకానికి వెళ్తాయని, అక్కడ పాప పుణ్యాలు నిర్ధారించిన తర్వాత నరకానికి వెళ్తాయా లేక స్వర్గానికి వెళ్తాయా అనే విషయం నిర్ణయిస్తారు. అని మన పురాణ గ్రంథాల్లో లిఖించబడి ఉంది. అయితే చనిపోయిన ఆత్మలు మొదటగా ఈ ధర్మేశ్వర మహాదేవ ఆలయంలోని యమధర్మరాజు గదిలోకి వస్తాయని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.
మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మను యమబటులు, యమధర్మరాజు దగ్గరికి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత వారి పాప,పుణ్యాలను నిర్ధారించి పక్క గదిలోకి ఆత్మలను పంపుతారు. తర్వాత అక్కడ వారికి సరైన శిక్షలు ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఆ ఆత్మలు యమలోకానికి పంపివేయబడతాయి.
యమలోకానికి వెళ్లిన తర్వాత దేవాలయంలో ఏ శిక్షలు అయితే నిర్ధారించారో, ఆ శిక్షలను ఆ ఆత్మలు అక్కడ అనుభవించవలసి ఉంటుంది.
ఇదంతా వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆత్మ ఈ దేవాలయంలోకి వస్తుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఈ విషయం గురించి గరుడ పురాణంలో కూడా రాసి ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక గరుడా పురాణంలోనే కాకుండా ఇంకా చాలా పురాణాల్లో కూడా ఈ విషయం గురించి చర్చించారు అని ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.