Interesting Facts : పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు టర్కీలో జరిపిన తవ్వకాల్లో 3000 సంవత్సరాల పురాతన ఉరార్టు ప్యాలెస్ శిథిలాలు కనిపెట్టారు. అయితే టర్కీలోని అతిపెద్ద సరస్సు, మధ్య ఆసియాలోని రెండో అతిపెద్ద సరస్సుల్లో ఈ శిథిలాలు ఉన్నప్పటికీ అవి ఇంకా మంచి స్థితిలోనే ఉండడం విశేషం.
తవ్వకాల్లో కనుక్కున్న ప్యాలెస్ అవశేషాలు తూర్పు వాన్ ప్రావిన్స్‌లోని గుర్పినార్ జిల్లా… పర్వతాల మధ్యలో 8,200 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రధాన ప్యాలెస్‌కు చెందినవని శాస్త్రవేత్తల బృందం వెల్లడించారు. ఆ నీటిలో ప్యాలెస్ పురాతన గోడల తో పాటు, నీటిని నిల్వ చేయడానికి వాడిన ఒక తొట్టిని, కొన్ని సిరామిక్ శకలాల్ని కూడా కనుక్కున్నారు. నీటి లోపల ప్యాలెస్ గోడలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు ఉన్నాయి.
లేక్ వాన్ ప్రస్తుత నీటి మట్టం అప్పటి ఉరార్టు నాగరికత కాలం కంటే అనేక వందల మీటర్లు ఇప్పుడు ఎక్కువగా ఉంది అనేది నిపుణుల అభిప్రాయం. సరస్సులో నీరు తక్కువగా ఉన్నప్పుడు అక్కడ పెద్ద గ్రామాలు ఉండేవని. చాలా మంది అక్కడ జీవించారని. సరస్సులో క్రమంగా నీరు పెరుగుతుంటే అందరూ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
వాటితో పాటు ఉరార్టు నాగరికతకు చెందిన 2,800 సంవత్సరాల పురాతన దేవాలయాన్ని నైరుతి భాగంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
ఈ దేవాలయాన్ని మతపరమైన పూజలల్లో దీన్ని ఉపయోగించేవారని, యురార్టియన్లుకు దైవ భక్తి ఎక్కువే అని తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో అనేక దేవుళ్లు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యుద్ధ దేవుడి పేరుతో వేడుకలు జరిగేవని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చారిత్రక విలువతో కూడుకున్న శిథిలాలు కావడంతో ఈ శిథిలాలు వేలమంది పర్యాటకులను ఆకర్షిస్తాయని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. వాన్ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద సోడియం నీటి సరస్సుగా పేరుగాంచింది. ఈ సరస్సు ఇరాన్ సరిహద్దుకు దగ్గరగా తూర్పు అనటోలియన్ ప్రాంతంలోని ఎత్తైన మైదానాలలో ఉంది. వాన్ ప్రావిన్స్ సమీపంలో నెమ్రుట్ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. దానివల్ల ఒక బిలం ద్వారా ఇది ఏర్పడింది.