Rainy season : వర్షాకాలం వచ్చేసింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతగానో ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో వైరస్ ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పెద్దలు, చిన్నలు అందరూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అధికంగా పెరిగి వ్యాధులను వృద్ధి చేస్తాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త వహించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పిల్లలు ఎదుర్కోవల్సి వస్తుంది.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం : వర్షాకాలంలో ముఖ్యంగా తినే ఆహార పదార్థాలను చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరం. లేదంటే వాటి ద్వారా సూక్ష్మజీవులు, క్రిములు వ్యాప్తి చెంది రోగాల భారీన పడతాము. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రపరచుకోవాలి. క్రిములు హానికర సూక్ష్మజీవులు విజృంభించకుండా అరికట్టాలి. వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు శుభ్రత చాలా అవసరం.
దోమల నివారణ, రక్షణ : వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. ఈ దోమలవల్ల అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దోమలు ఇంట్లోకి రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. మస్కిటో రిపెల్లెంట్ క్రిములు, ప్లగ్ ఇన్ పరికరాల సహాయంతో దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దోమలు పిల్లలకు దరిచేరకుండా వారికి పొడవైన దుస్తులను వేయాలి.
పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి : ఇంటి పరిసరాలు చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అధికంగా ఉంటాయి. డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు, మొదలైన ప్రాంతాలలో నీరు నిలవకుండా చూడాలి. మ్యాన్ హోల్స్ మూసి ఉంచుకోవడం మంచిది. అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలను అటువైపుగా వెళ్ళనివ్వకూడదు.
వర్షంలో పిల్లలు తడవకుండా తగు జాగ్రత్తలు : వర్షం పడుతుంటే పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతూ ఆ వర్షపు జల్లులో తడవాలని చూస్తూ ఉంటారు. కానీ అలా తడవడం వల్ల పిల్లలకు జలుబు, జ్వరము వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లలను వర్షం నీటిలో తడవకుండా చూసుకోవాలి. వర్షం సమయంలో వాతావరణం చల్లబడిపోతుంది. కాబట్టి పిల్లలకు దుస్తులు నిండుగా వేయాలి.
ప్రధమ చికిత్స కిట్ : వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సిద్ధంగా ఉండడం కోసం ఇంట్లో ప్రధమ చికిత్స కిట్ నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇంట్లో సరుకులు, తాగునీటి అవసరమైన వాటిని స్టాక్ తెచ్చి పెట్టుకోవాలి.