World Laughter Day 2023 : “నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం” అన్నారు పెద్దలు. మనుషులు ఏదైనా బాధలో,ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్త చిరునవ్వు ఎంతో ఊరటను ఇస్తుంది. రోజు ఎలాగో ఒక్కొక్కరి జీవితం చాలా టెన్షన్ లతో గడిచిపోతూ ఉంటుంది. ఈ గజిబిజి గందరగోళంలో మన జీవితంలో జరిగిన ఆనంద క్షణాలను తలచుకొని కాస్తైనా మనం నవ్వకపోతే మానసికంగా, శారీరకంగా మనం ఎంతో నష్టపోతాం.
రోజులో ఎక్కువగా నవ్వుతూ ఆనంద క్షణాలను గడిపేవారు ఎక్కువ రోజులు జీవిస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాకుండా నవ్వు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇలాంటి నవ్వుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ నవ్వుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం, మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటాం. అసలు ఈ నవ్వుల దినోత్సవం ఎలా మొదలైందంటే..
డాక్టర్ మదన్ కటారియా 1988 లో నవ్వుల యోగ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. నవ్వు వల్ల ఒక మనిషి లో వచ్చే మార్పును, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, అందరికీ తెలియ చెప్పడం కోసం ఈ రోజును ఆయన ప్రారంభించారు. మొట్టమొదటి నవ్వుల దినోత్సవం ముంబైలో మే10వ తేదీన నిర్వహించారు. ప్రపంచంలో శాంతిని ,స్నేహాన్ని, సోదర భావాన్ని ఈ నవ్వు ద్వారా విస్తృతపరచాలనేది ఈ నవ్వుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నవ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నవ్వు మనలోని కార్టిసోల్స్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ ను తగ్గించడంలో ఎంతో సహకరించి, బరువు తగ్గడంలో కూడా ముఖ్యభూమిక పోషిస్తుంది. ముఖ ఖండరాల వ్యాయామంలో నవ్వు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒక నవ్వు తర్వాత కలిగే ఆనందం, ఉత్సాహం మాటలల్లో వర్ణించలేనిది. ఇంకెందుకు ఆలస్యం ఓ చిరునవ్వుల జల్లు లో మీరూ తడిచిపోండి.