ఒక స్టార్ హీరో సినిమాకి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్, హైప్స్, టికెట్ హైక్స్ ఇన్ని చేసినా సినిమా రిలీజ్ అయ్యాక చేసే పైరసీకి నిర్మాతలు విలవిలలాడిపోతు ఉంటారు. చాలా నష్ట పోతూ ఉంటారు. సినిమా హిట్ టాక్ వచ్చేదాకా ఊపిరి బిగపట్టుకుని ఉంటారు. ఫ్లాప్ టాక్ వస్తే పెద్ద నిర్మాత తట్టుకుంటాడు.చిన్న నిర్మాత కోలుకోలేని దెబ్బతింటాడు.
అదే కోట్ల రూపాయలు పెట్టి తీసిన ఒక సినిమా విడుదలకి ముందే అంగట్లో ఐదుకి, పదికి దొరుకుతుంటే, విడుదల అయ్యాక వచ్చే నెగిటివ్ రివ్యూలు విడుదలకి ముందే వస్తుంటే, యాంటిస్ పనిగట్టుకుని షేర్లు చేస్తుంటే, ఏ స్థాయి నిర్మాతకైన అది గుండె పోటు తెచ్చే పరిస్థితే.. ఎందుకంటే సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ జీతాలకి, రెమ్యునరేషన్లకి సినిమా విడుదలతో, సంబంధం ఉండదు. ఒక్క నిర్మాతకి భవిష్యత్ మాత్రమే సినిమా రిజల్ట్ మీద ఆధారపడి వుంటుంది.
అలా విడుదలకి ముందే రిలీజ్ అయిపోయి నిర్మాతకి గుండె పోటు తెప్పించిన సినిమా అత్తారింటికి దారేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో B.V.S.N ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకి ముందే పైరసీ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసి, ఇండస్ట్రీ విస్తుపోయే కలెక్షన్స్ కురిపించి, పైరసీలో చూసిన వాడే రిపీట్ మోడ్లో థియేటర్ లో సినిమా చూసాడు అంటే దాని వెనుక ఒక పవర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ పవర్ పేరే పవన్ కళ్యాణ్.ఇది అభిమానులతో పాటు. మొత్తం ఇండస్ట్రీ ఒప్పుకున్న నిజం. కరెక్ట్ సినిమా పడితే అది సృష్టించే సంచనాలను పైరసీ సైతం ఆపలేని క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతమని నిరూపించిన నిజం.
పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఆద్యంతం ఎమోషన్స్, సెంటిమెంట్ తో కలగలిసిన ఒక క్లాస్ సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించిన తీరు అభిమానులను,ప్రేక్షకులను కట్టి పడేశాయి. సమంత, నదియ, రావు రమేష్, బోమాన్ ఇరానీ, కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందంల పాత్రలు సినిమాకి నిండు తనాన్ని, అదనపు ఆకర్షణ తెచ్చి పెట్టాయి.
ఇక త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్ ఆరడుగుల బుల్లెట్ లాంటి పవన్ కళ్యాణ్ చెప్తుంటే బుల్లెట్స్ లా ప్రేక్షకుల మైండ్ లోకి దూసుకు పోయాయి. “చూడప్పా సిద్ధప్పా, నేను సింహం లాంటోణ్ణి. అది గడ్డం గీసుకోదు.. నేను గీసుకొంటాను. అంతే తేడా. మిగతాదంతా సేం టు సేం” ఈ డైలాగ్ అయితే ఇంకో పాతికేళ్ళు గడిచినా ప్రేక్షకుల మైండ్ నుంచి పోదు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక పాటలు విషయానికి వస్తె దేవిశ్రీ తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు..పాటలన్నీ ఆ ఏడాది హిట్స్ ఆల్బమ్స్ లో ఒకటిగా చోటు సంపాదించాయి. ఇక పవన్ కళ్యాణ్ పరిచయ గీతం “వీడు ఆరడుగుల బుల్లెట్టు” పాటకైతే ఫాన్స్ ఫిదా అయిపోయారు.
కాటమ రాయుడా అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన జానపద గీతం ఇప్పటికీ అభిమానులను ఉర్రూతలూగస్తుంది.
త్రివిక్రమ్ కథ, క్యాచీ పంచ్ డైలాగ్స్, దేవిశ్రీ ఉర్రూతలుగించే పాటలు, నేపథ్య సంగీతం ఉన్నా వాటన్నింటిని మించి ప్రేక్షకులని మళ్లీ మళ్లీ ధియేటర్ వైపు నడిపించింది మాత్రం పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, స్టైల్, ఈజ్ అండ్ ఆటిట్యూడ్.
27-09-2013 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాలో అరుదైన రికార్డ్స్ నెలకొల్పిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటీ పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి నిరూపించింది. మొత్తం 71 కోట్ల వరల్డ్ వైడ్ షేర్, 135 కోట్ల వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్స్ తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇంతటీ ఘన విజయం సొంత చేసుకున్న అత్తారింటికి దారేది చిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ కి ట్రెండ్ ఆంధ్రా తరపున శుభాకాంక్షలు.