ఏజెంట్ మూవీ నష్టాల వివాదం, కోర్టులో కేసు.. నిర్మాత అనిల్ సుంకర సీరియస్ వార్నింగ్
నిర్మాత అనిల్ సుంకరకి గత ఏడాది ఏమాత్రం కలసి రాలేదు. ఆయన నిర్మించిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు తీవ్ర నష్టాలని మిగిల్చాయి. ముఖ్యంగా అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం 10 శాతం రికవరీ చేయలేకపోయింది. ఈ చిత్రం మిగిల్చిన నష్టాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఆల్రెడీ బుధవారం రోజే ఈ చిత్ర పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
అయితే ఇంతలోనే ఈ చిత్ర రిలీజ్ ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏజెంట్ చిత్రంతో నష్టపోయిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ ఊరు పేరు భైరవకోన రిలీజ్ ఆపాలంటూ కోర్టుకి వెళ్లారు. అయితే కోర్టు ఈ చిత్ర రిలీజ్ ని అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీనిపై నిర్మాత అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
సినిమా నిర్మాతగా నేను నష్టపోయాను.. నాతో పాటు ఆయన కూడా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నన్నే కార్నర్ చేయడానికి చూస్తున్నారు. సినిమా కూడా వ్యాపారమే. వ్యాపారం అన్నాక లాభాలు నష్టాలు ఉంటాయి. కానీ ఇలా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేయడం ద్వారా నన్ను ఎవరూ భయపెట్టలేరు.
కోర్టుకి వెళ్లి కేసులు పెట్టి న్యాయపరంగా కష్టపెట్టగలరు.. కానీ భయపెట్టలేరు. కోర్టుకి వెళితే ఏమొస్తుంది.. న్యాయవాదులకు ఫీజులు అదనపు భారం అవుతుంది. ఎవరికీ ఉపయోగం లేదు. అతనిపై నాకు ఎలాంటి కోపం ద్వేషం లేదు. భవిష్యత్తులో సతీష్ కి ఏదైనా మంచి చేస్తానని అనిల్ సుంకర అన్నారు.