Censor Board : ఇటీవల విడుదల అయిన “దసరా” సినిమా బ్లాక్ బస్టర్ అయి, 100 కోట్ల క్లబ్ కి చేరువలో ఉన్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణా యాసలో సాగుతుంది. దీన్ని అందరూ ఎంజాయ్ చేస్తుండగా.. సినిమాలోని కొన్ని మాములు మాటలకు సెన్సార్ బోర్డ్ వారు కోత విధించారు. సెన్సార్ బోర్డ్ ఆ మాములు మాటలను కూడా బూతద్దంలో పెట్టి చూడ్డం ఇక్కడ వింతగా చెప్పుకోవచ్చు.

బాషా, యాస ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. అక్కడ మాటకు అర్థం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఆ విషయంలో సెన్సర్ బోర్డ్ కి పరిపక్వత లేదని చెప్పొచ్చు. సెన్సార్ బోర్డ్ వారు దసరా సినిమాలో కోతకు కారణం తెలంగాణ యాసకు సంబంధించిన కొన్ని పదాలను సెన్సార్ బోర్డ్ సభ్యులకు అర్థం కాలేదని, దాని వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది.
అయితే ఆ కోత అనేది ఒక్కటి, రెండు మాటలకు కాదు. ఏకాంగ ముప్పై నుండి నలబై మ్యూట్స్ వేసారు అంటే తెలంగాణ యాస మీద సెన్సార్ బోర్డుకు ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. తెలంగాణ యాసను వారు ఎంత చిన్నచూపు చూస్తున్నారో, ఎంత వివక్ష చూపిస్తున్నారో అనే విషయం తేటతెల్లం అవుతుందని కొందరు సినీ ప్రేమికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు వేరు వేరుగా సెన్సార్ బోర్డ్ ఉండాలి అని, లేకుంటే ఇలాంటి నష్టాలు ఇంకా జరుగుతాయి అని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం సెన్సార్ బోర్డు విషయంలో రాజకీయం చేయొద్దు అంటూ ఇండస్ట్రీ కలిసి ఉంటేనే ఇంకెన్నో అద్భుతాలు సృష్టించొచ్చు అని చెప్తున్నారు. సెన్సార్ బోర్డ్ సభ్యుల్లో తెలంగాణ, ఆంధ్ర ఆధిపత్య పోరులాగా సాగుతోంది వ్యవహారం. ఈ వివాదాల కారణంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
