Game Changer story : రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో వెన్నుపోటు రాజకీయం.. ముగ్గురు విలన్లతో ఐఏఎస్ అధికారి పోరాటం
మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ చాలా కాలంగా ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ శంకర్ డిసైడ్ అయ్యారు. ఇటీవల వైజాగ్ లో ఈ చిత్ర కీలక షెడ్యూల్ ప్రారంభం అయింది.
షూటింగ్ చివరి దశకి చేరుకునే కొద్దీ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్ర కథకి సంబంధించిన కీ పాయింట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రాంచరణ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకుల పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. తండ్రి పేరు అప్పన్న. పేద ప్రజల కోసం పోరాడే అప్పన్న సొంతంగా పార్టీ పెట్టి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు.
అతడి స్నేహితుడిగా ఉన్న శ్రీకాంత్ వెన్ను పోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకుంటాడు. శ్రీకాంత్ కొడుకు ఎస్ జె సూర్య తండ్రిలాగే స్వార్థ బుద్ది, క్రూయల్ మైండ్ తో పెరుగుతాడు. మరోవైపు అప్పన్న కొడుకు రామ్ నందన్ తెలివైన కుర్రాడు. ఐఏఎస్ అధికారి అవుతాడు. శ్రీకాంత్, ఎస్ జె సూర్య పాలనలో ప్రజల అష్టకష్టాలు పడుతుంటారు. ఎస్ జె సూర్య పథకాలు రచించడం.. వాటిని తమ్ముడు నవీన్ చంద్ర అమలు చేయడం జరుగుతూ వస్తుంది.
ఈ క్రమంలో నిజాయతీ పరుడైన రామ్ నందన్ ఐఏఎస్ కి తన తండ్రి, శ్రీకాంత్ మధ్య జరిగిన విషయం ఎలా తెలుస్తుంది.. తండ్రి వెన్నుపోటుకి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు.. అవినీతి పరుడైన ఎస్ జె సూర్య ని ఎలా అంతం చేశాడు అనేది శంకర్ స్టైల్ స్క్రీన్ ప్లేతో మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ఈ ముగ్గురు రాష్ట్ర రాజకీయాలని శాసించగల బలమైన వ్యక్తులు. వీరితో సాధారణ ఐఏఎస్ అధికారి ఎలా పోరాటం చేశాడు అనేది ఉత్కంఠగా ఉంటుంది.