Dhanush Court Case : స్టార్ హీరో పుట్టుమచ్చ వల్ల నిజం బట్టబయలు.. 8 ఏళ్లుగా సాగుతున్న కేసు క్లోజ్
hero dhanush court case closed with mind blowing twist
ధనుష్ అంటే వెంటనే అతడు చేసే వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన నటన గుర్తుకు వస్తాయి. ధనుష్ కి రజనీకాంత్ అల్లుడిగా కూడా గుర్తింపు ఉంది. కానీ ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోయిన తర్వాత ధనుష్ మాజీ అల్లుడు అయ్యాడు. అందరి హీరోల్లా ధనుష్ కమర్షియల్ చిత్రాలు చేయడు. అసురన్, కర్ణ లాంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తాడు కాబట్టే ధనుష్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
అయితే ధనుష్ కొన్నేళ్లుగా ఓ కేసు వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మధురై లోని మేలూరుకి చెందిన కదిరేశన్ దంపతులు ధనుష్ తమ కొడుకు అంటూ దాదాపు 8 ఏళ్ళ క్రితం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ధనుష్ కి కదిరేశన్ దంపతులు తలనొప్పి వ్యవహారంలా మారారు.
తనకి కదిరేశన్ దంపతులకు ఎలాంటి సంబంధం లేదని ధనుష్ మొత్తుకుంటున్నా వినడం లేదు. కదిరేశన్ దంపతులు ధనుష్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తమ వద్ద ఉన్నాయి అంటూ కొన్ని కొన్ని ఆధారాలు కోర్టుకి సమర్పించారు. దీనితో కొన్నిసార్లు ధనుష్ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్నేళ్ల క్రితం మేలూరు నుంచి ఈ కేసు మధురై కోర్టుకి బదిలీ అయింది. మధురై కోర్టులో కదిరేశన్ దంపతులు ధనుష్ పుట్టుమచ్చల వివరాలు అంటూ స్కూల్ టీసీని అందించారు. ధనుష్ 11వ తరగతిలో సినిమాల్లోకి వెళ్లాలని ఇంటికి నుంచి పారిపోయాడని.. అతడు మా కొడుకే అని వాదిస్తున్నారు. ధనుష్ ని తమ కొడుకుగా ప్రకటించి ఈ వయసులో తమకి ధనుష్ నుంచి 60 వేలు ప్రతి నెలా అందేలా చూడాలని కోర్టు వద్ద మొరపెట్టుకున్నారు.
ఇక ధనుష్ లాయర్ కూడా అతడి పుట్టు మచ్చల వివరాలని కోర్టుకి అందించారు.రెండూ వేరు వేరుగా ఉండడంతో ధనుష్ ని పిలిపించారు. రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ధనుష్ పుట్టుమచ్చల పరిశీలన చేయాలనీ జడ్జి ఆదేశించారు. దీనితో జడ్జీ ధనుష్ పుట్టుమచ్చలని పరిశీలించారు. అయితే కదిరేశన్ దంపతులు చెబుతున్నట్లు ధనుష్ కి పుట్టుమచ్చలు లేవు. దీనితో ఆధారాలు సరిగా లేనందున కదిరేశన్ దంపతుల పిటిషన్ ని జడ్జి కొట్టివేశారు.
