Jacqueline Fernandez : హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు వ్యాపించడంతో..
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తరచుగా ఏదో విధంగా వార్తల్లో ఉంటోంది. జాక్వెలిన్ హిందీలో సల్మాన్ ఖాన్ కిక్ చిత్రంతో గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో ప్రభాస్ సాహో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం జాక్వెలిన్ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా జాక్వెలిన్ నివసిస్తున్న అపార్ట్మెంట్ లో ఊహించని విధంగా మంటలు చెలరేగాయి.
జాక్వెలిన్ ముంబై లోని విలాసవంతమైన బాంద్రాలో ఉంటోంది. బాంద్రాలోని పాళీ హిల్ ప్రాంతంలో నవ్రోజ్ హిల్ సొసైటీ అనే అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఇదే అపార్ట్ మెంట్ లో జాక్వెలిన్ 15 వ అంతస్థులో ఉంటోంది. 13 వ అంతస్తులోని ఓ ఇంటి వంటగది నుంచి భారీగా మంటలు వ్యాపించాయట. 13వ అంతస్థు మొత్తం భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
దీనితో ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి నాలుగు ఫైర్ ఇంజన్లు, మూడు జంబో వాటర్ ట్యాంకర్ లతో మంటల్ని అదుపుచేశారు. మంటలు మరో అంతస్తులోకి వ్యాపించకుండా అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంటున్నారు. జాక్వెలిన్ నివాసం ఉంటున్న పక్క అపార్ట్ మెంట్ లోనే కరీనా కపూర్, సైఫ్
అలీఖాన్ ఉంటున్నారు. కరీనా, రణబీర్.. దీపికా, రణ్వీర్ ల ఇల్లు కూడా అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
జాక్వెలిన్ గత ఏడాది ఆ ఇంటిని కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆమె నివాసం ఉంటున్నది 5 బి హెచ్ కె ఇల్లు. ప్రస్తుతం జాక్వెలిన్ హాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకుంటోంది.