Mega Heroes : మెగా ఫ్యామిలీ గతకొంత కాలంగా ఫుల్ ఖుషీగా ఉంది. RRR కి ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా, సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. భీమ్లా నాయక్ తర్వాత చాన్నాళ్లకు వచ్చే నెలలో పవన్ మూవీ బ్రో రిలీజ్ కానుంది. యాక్సిడెంట్ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. ‘విరూపాక్ష’తో హిట్ కొట్టి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. తాజాగా రామ్ చరణ్,

ఉపాసన దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీ రెట్టింపు ఉత్సాహంతో ఉంది. మరోవైపు మెగా హీరోలంతా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో మెగా హీరోల మూవీ సెంటిమెంట్ ఒకటి వైరల్ గా మారింది. విరూపాక్ష బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీకి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. దీంతో మెగా హీరోస్ మూవీ నేమ్స్ చర్చనీయాంశంగా మారాయి.
గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీస్ చేశాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’ చేశాడు. ఇప్పుడు చిరు మళ్లీ ‘భోళా శంకర్’ అనే చిత్రం చేస్తున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ్.. ‘గాంజా శంకర్’ అనే మాస్ టైటిల్ ని తన కొత్త మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మెగా హీరోస్ ‘శంకర్’ అనే పేరుని టైటిల్ గా ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. ఇక ముందు మిగతా మెగా హీరోలు కూడా ఈ పేరుతో సినిమాలు చేసే అవకాశం లేకపోలేదు.
