Nenoka Natudni Shayari : ” నటసమ్రాట్” మరాఠీలో నానా పాటేకర్ గారు నటించిన చిత్రరాజం. ఒక రంగస్థల నటుడు తన కెరీర్లో దేవుడి తర్వాత దేవుడంత అభిమానాన్ని, గౌరవాన్ని పొంది తనదైన అభిజాత్యాన్ని కలిగి ఉండి తన వృత్తి నుండి రిటైర్ అయ్యాక ఎలా ప్రవర్తిస్తాడు? అతని జీవితం ఎలా ఉంటుంది ? పనిలో పడి బ్రతకడం మర్చిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం మొదలుపెడితే జరిగిన పరిణామాలేంటి..? అనేదే కథ..
అభిమానుల ముందు సూర్యుడిలా ప్రకాశించిన అతడికి జీవితంలో మరోవైపు కమ్ముకున్న చీకటి, ఒక నటుడు తన వ్యక్తిగత జీవితంలో పడ్డ సంఘర్షణ, అంతర్యుద్ధం ప్రతి గుండెని తడమక మానదు. అదే కథని, బ్రతుకుని కృష్ణవంశీ గారు మనకి అందించాలని సాగిస్తున్న యజ్ఞమే – “రంగమార్తాండ”.
———
ప్రతి రచయిత, కవి తన జీవిత కాలంలో ఒక ఉజ్వలదశను అనుభవిస్తాడు కాదు ఆ కాలాన్ని తన కలంతో రగిలించి ఆ సమయాన్ని పుట్టిస్తాడు. దిశలన్నింటినీ తనవైపు చూసేలా ఓ యుద్ధమే చేస్తాడు.
లక్ష్మీ భూపాల్ గారు రాసిన ఈ షాయరీ తన రచనా పరిణామక్రమంలో పరిణితి చెందిన మైలురాయిలా సినీలోకం మర్చిపోలేని జ్ఞాపకంలా అలా శాశ్వతంగా మిగిలిపోతుంది.
” నేనొక నటుణ్ణి ”
ఈ షయరీలో అన్నింటికంటే ఒక లైన్ నన్ను చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేసింది, గుండెని పిండి ఆరేసింది.. పక్కన ఎవరూ లేకపోతే ఒక కన్నీటి బొట్టు బహుమతిగా ఇవ్వాలన్పించింది..
“నేనొక నటుణ్ని…అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి…“
ఒక్కసారిగా మెదడుపొరల్లో ఒక అంతరిక్షనౌకలాంటి అతి వేగమైన ప్రయాణం జరిగి మంజునాథ సినిమాలో శివయ్య దగ్గర ఆగింది.
ఆ సినిమాలో శంకరుడు.. అదే మన చిరంజీవి..ఇక్కడ ఈ పద్యం పాడుతున్న నటుడు అక్కడ అన్నమాటలు గుర్తొచ్చాయి…!!
” కనీసం నుదుటి రాత కూడా లేని బిచ్చగాన్ని.. ”
అచ్చం ఆ దేవుడిలాగే అభిమానుల గుండెల్లో దేవుడంత స్థానం పొందిన ఈ డెమి గాడ్.. “నేనొక నటుణ్ని..
అసలు ముఖం పోగొట్టుకున్న అమయకుణ్ణి” అని బాధపడ్డప్పుడు ఆ సన్నివేశమే కళ్ళముందు మెదిలింది.
అలాంటప్పుడు ఉన్నదంతా నేనే అనుకునే ఈ నటుడి గురించి అహం బ్రహ్మస్మి అని రచయిత లిఖించడంలో ఏమాత్రం తప్పులేదు, కానీ పొగిడిన అరక్షణంలోపే అసలున్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని అని నిట్టూర్చడం, శ్రోత / పాఠకుడి, గుండెని మెలిపెట్టడం అతని కలం చేసిన విన్యాసం.
కులం, మతం పునాదులుగా నిర్మించబడ్డ ఈ నేలపై హద్దులు చెరిపేసి అందరినీ అభిమానం అనే పేరుతో ఒక్కచోటకి చేర్చింది రంగుల లోకంలో రాజుగా సింహాసనం అధిష్టించిన ‘నటుడే’. అందుకే ఇలా అన్నాడు…
నేనొక నటుణ్ని….
వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి
వేషం తీస్తే ఎవరికీ కాని జీవుణ్ణి.
అందరిలా అమ్మ కడుపు నుండి జన్మించినా తన నటనతో లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసి కోట్లాది మంది గుండెల్లో జీవించిన వాడి జీవితమిలాగే ఉంటుంది, వాడు జగం కోసమే జన్మించిన కారణజన్ముడు.
” జగాలకి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగాలకి మరణిస్తాను, పోయినా ఇంకా బతికే ఉంటాను”
వృత్తి మీద ప్రేమతో బతకడం మర్చిపోయిన కళాకారుడు సగానికే జీవిస్తాడు మరి!.
——–
నాది కాని జీవితాలకి జీవం పోసే నటుణ్ని..
నేను కాని పాత్రల కోసం వెతికే విటుణ్ని..
ఒక నటుడి కళని, నటనపట్ల తన ఆరాధనని ఈ రెండు ముక్కల్లో చెప్పడం వేల పత్రాల్లో లిఖించడం ఒక్కటే అంటాన్నేను. చివరికి నటనపట్ల అతడి కోరికని శిఖరాగ్రస్థాయిలో నిలబెట్టడానికి అతడి మనసుని, ఆశని విటుడితో పోల్చాడీ రచయిత.
——-
ఈ నటుడు – హరివిల్లుకి ఇంకో రెండు రంగులేసి నవరసాలు మీకిస్తానని గర్వపడ్డా!!!
మీ అంచనాలు దాటే ఆజానుబాహుణ్ణి, తొమ్మిది తలలున్న నట రావణుణ్ణి అని ఆత్మాభిమానాన్ని ప్రదర్శించినా!
సంచలనాలను సృష్టించే మరో కొత్త దేవుణ్ణి
నరం నరం నాట్యమాటే నటరాజ రూపాన్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అని ఘీంకరించినా!!
చివరికి –
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేనని, తీర్చలేని ఋణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుణ్ణి నేనంటూ… ఆఖరి శాశ్వవరకు నటనే నాకు ఆశ అని నటుడిగా ఇష్టపడ్డందుకు వినమ్రుడై శతకోటి నమస్సులు సమర్పించాడు, చిరకాలం ప్రభవించాడు.
—-
ఈ మొత్తం వ్యాసంలో ఇద్దరికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఒకటి తన పిడుగులాంటి కంఠంతో ఈ షాయరీని ఇంకో మెట్టు ఎక్కించిన చిరంజీవి గారికి..
రెండు ఈ షాయరీకి పునాది అయిన లక్ష్మీ భూపాల్ గారికి,
“తనది కాని జీవితాన్ని అచ్చంగా ప్రకాశింపచేసేది ఒక్క కళాకారుడే..” నటుడు కాని ఈ రచయిత నటుడి జీవితంలో ప్రపంచం చూసిన వెలుగుల్ని, ఎవ్వరికీ కానరాని నీడలని ఇంత హృద్యంగా లిఖించడం వెనక ఎంత సంఘర్షణ పడ్డాడో..!!
నిజమే నింగి, నేల రెండడుగులైతే తన కలం మూడో పాదంగా మన గుండెలకు గాయం చేసిన ఈ ఘట్టం
లక్ష్మీ భూపాలుడి త్రైవిక్రమ విస్తరణమే..
– మిహిర.