Rajamouli Best Movie: జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి
దర్శక వీరుడు రాజమౌళి ఇటీవల జరిగిన జూనియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా జూనియర్ చిత్రంతో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టాలీవుడ్ లో ఆమెకి ఇది రీ ఎంట్రీ చిత్రం.
రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళికి యాంకర్ సుమ కొన్ని ఫోటోలు చూపించారు. అవి రాజమౌళి చిత్రాలకు సంబంధించిన ఫోటోలు. ఒక్కో ఫోటో గురించి రాజమౌళి ఒక్కో విధంగా స్పందించారు. ఈగ చిత్రానికి సంబంధించిన ఫోటో కనిపించినప్పుడు.. నా కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ ఇదే అంటూ రాజమౌళి కామెంట్ చేయడం విశేషం. బాహుబలి, మగధీర, ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ చిత్రాలను పక్కనపెట్టి ఈగ తన బెస్ట్ మూవీ అని రాజమౌళి చెప్పడం ఊహించని విషయమే.
నితిన్ సై చిత్రానికి ప్రత్యేక స్థానం
అదేవిధంగా నితిన్, జెనీలియాతో తెరకెక్కించిన సై చిత్రాన్ని కూడా రాజమౌళి గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ లో సై చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. సింహాద్రి లాంటి మాస్ మూవీ తర్వాత మళ్లీ మాస్ చిత్రమే చేయాల్సిన అవసరం లేదు.. మనకి నచ్చిన కథాంశం ఎంచుకొని చక్కగా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారని నిరూపించిన చిత్రం సై అని రాజమౌళి అన్నారు. దర్శకుడిగా ప్రయోగాలు చేసేందుకు కాన్ఫిడెన్స్ ని ఇచ్చిన మూవీ సై అని రాజమౌళి తెలిపారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జెనీలియా వయసు కాలంలో ఆగిపోయిందని.. జెన్నీ అని ముద్దుగా పిలుస్తూ నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు అని రాజమౌళి వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ప్రశంసలతో జెనీలియా సంతోషం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
