ఫోర్బ్స్ జాబితాలో రష్మిక, అరుదైన ఘనత సాధించిన నేషనల్ క్రష్.. విజయ్ దేవరకొండ ఆనందం చూశారా
నేషనల్ క్రష్ రష్మిక మందన అరుదైన ఘనత సాధించింది. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. జీవితంలో ఒక్కసారైనా ఫోర్బ్స్ మ్యాగజైన్ లిస్ట్ లో చేరాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. 30 ఏళ్లలోపు వయసులో ఎన్నో ఘనతలు సాధించిన వారిని గుర్తించి ఈ జాబితాలో చేర్చింది ఫోర్బ్స్. దీనికి 30 అండర్ 30 అనే పేరుతో మ్యాగజైన్ లిస్ట్ రిలీజ్ చేశారు.
ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంతో రష్మిక ఉబ్బి తబ్బిబవుతోంది. వెంటనే తన సంతోషాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. రష్మిక కన్నడ ఇండస్ట్రీలో నటిగా ప్రయాణం మొదలు పెట్టి టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. అంతే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పాపులర్ అవుతోంది. రష్మిక వయసు 27 ఏళ్ళు. తక్కువ వయసులోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో రష్మిక ఒకరిగా నిలిచింది.
పుష్ప, యానిమల్ లాంటి పాన్ ఇండియా హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దీనితో ఫోర్బ్స్ మ్యాగజైన్ రష్మికని గుర్తించింది. రష్మికకి అరుదైన గౌరవం దక్కడంతో ఆమె కంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎక్కువగా సంబరపడిపోతున్నారు. విజయ్ దేవరకొండ వెంటనే సోషల్ మీడియాలో రష్మికకి శుభాకాంక్షలు తెలిపాడు. చాలా గర్వంగా ఉంది.. అసలు ఏమీ లేని స్థాయి నుంచి ఇక్కడి వరకు చేరుకున్నావు.. ఇంకా ఎదగాలి అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2 తో పాటు కొన్ని బాలీవుడ్ చిత్రాలు చేస్తోంది. పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.