తీవ్ర విషాదం.. RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి మృతి, చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
చిత్ర పరిశ్రమలో ఊహించని విషాదకర సంఘటన చోటు చేసుకుంది. భారీ చిత్రాల సినిమాటోగ్రాఫర్ గా అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న సెంథిల్ కుమార్ సతీమణి రూహి గురువారం రోజు అనారోగ్యం కారణంగా మరణించారు. అత్యంత పిన్న వయసులో ఆమె మరణించడంతో తెలుగుచిత్ర పరిశ్రమ మొత్తం విషాదం నెలకొంది.
సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు అయితే ఈ సంఘటనని జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. సెంథిల్, రూహి లకు ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. సెంథిల్, రూహి 2009లో వివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో రూహిని మృత్యువు వెంటాడింది.
కోవిడ్ సమయం నుంచే రూహికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇటీవల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో సెంథిల్ కూడా సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. కాగా నేడు ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో మల్టి ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. దీనితో ఆమె మరణించడం జరిగింది.
ఈ విషాదకర వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు రూహి మృతికి సంతాపం తెలుపుతున్నారు. సెంథిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. రూహి యోగా టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి బాగా క్లోజ్ అని సమాచారం.
శుక్రవారం జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో రూహి అంత్యక్రియలు జరగనున్నాయి. సెంథిల్ కుమార్ భారీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా ఎంతో ప్రాముఖ్యత సాధించారు. రాజమౌళి, సెంథిల్ కుమార్ లది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీరి కాబోలో సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి.
