Suhani Bhatnagar : మరో విషాదం..19 ఏళ్ళకే దంగల్ నటి కన్నుమూత..మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, మృతికి కారణాలు ఇవే
ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి రూహి మరణ వార్త జీరించుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషాదం జరిగింది టాలీవుడ్ లో కాదు.. బాలీవుడ్ లో. అమీర్ ఖాన్ ఆల్ టైం క్లాసిక్ దంగల్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని భట్నాగర్ (19) నేడు శనివారం రోజు అనారోగ్యం కారణంగా మరణించారు.
సుహాని దంగల్ చిత్రంలో బబిత కుమారి ఫోగట్ పాత్రలో అద్భుతంగా నటించింది. దంగల్ తర్వాత కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ సుహాని సినిమాలు పక్కన పెట్టి చదువుపై శ్రద్ద పెట్టింది. కానీ నేడు ఆమె మరణించడంతో చిత్ర పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి గురవుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుహాని ఇలా పిన్న వయసులోనే మరణించడంతో ఎవరూ జీర్ణించుకోలేకున్నారు.

నేడు సుహాని ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణానికి వైద్యులు చెబుతున్న ప్రధాన కారణాలు ఇవే. గతంలో సుహాని యాక్సిడెంట్ కి గురికావడంతో కాలు విరిగింది. దీనికి చికిత్స తీసుకుంటున్న సుహాని ఎక్కువగా మెడిసిన్స్ వాడాల్సి వచ్చేది. అయితే మెడిసిన్స్ వల్ల ఆమెకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువగా చేరింది. శరీరం మొత్తం నీరు పేరుకుపోవడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు చెబుతున్నారు. అందువల్లే సుహాని మరణించిందని అంటున్నారు. చదువు పూర్తయ్యాక తిరిగి సినిమాల్లో నటించే ఆలోచనలో సుహాని ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఇలా విధి వంచించడంతో సుహాని తిరిగిరాని లోకాలకు వెళ్ళింది.
