SuperStar Krishna : మహేష్ బాబు చిత్రాల్లో కృష్ణకి నచ్చిన మూవీ ఇదే, ఆ రోజు కంటతడితో.. 23 ఏళ్ళు పూర్తి
సూపర్ స్టార్ మహేష్ బాబు పాతికేళ్ల క్రితం రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు మహేష్ తన తండ్రి కృష్ణ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. మహేష్ బాబు మాస్ హీరోగా ఎదిగింది ఒక్కడు చిత్రంతోనే. కానీ మహేష్ లోని నటన అంతకంటే ముందే మురారి చిత్రంతో బయటపడింది.
మురారి చిత్రంలో మహేష్ బాబు ఇంటెన్స్ పెర్ఫామెన్స్ చూడొచ్చు. యాక్షన్, కామెడీ , రొమాన్స్, సెంటిమెంట్ ఇలా మహేష్ బాబులో అన్ని షేడ్స్ ని చూపించిన చిత్రం మురారి. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి చిత్రం విడుదలై నేటికి 23 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మురారి విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యజ్ఞ యాగాలు, కుటుంబానికి తగిలిన శాపాలు, జాతకాలు ఈ అంశాలతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాని కూడా కృష్ణ వంశీ ఈ చిత్రంలో పండించారు. ఈ చిత్రానికి అనేక నంది అవార్డులు దక్కాయి. నటుడిగా మహేష్ బాబుకి స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. అన్నింటికంటే ఈ చిత్రానికి వచ్చిన గొప్ప అవార్డు మరొకటి ఉండదట.. అది తన తండ్రి నుంచి వచ్చిన రెస్పాన్స్ అని గతంలో మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు. మహేష్ కెరీర్ లో ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఈ చిత్రాలు విజయం సాధించినప్పుడు కృష్ణ గారు తనని చాలా అభినదించారట. కానీ మురారి చిత్రానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా ప్రత్యేకమైనది అని మహేష్ గతంలో తెలిపాడు.
మురారి రిలీజ్ అయినప్పుడు హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో మహేష్ బాబుతో కలసి కృష్ణ సినిమా చూశారు. సినిమా ముగిసిన తర్వాత కృష్ణ ఆనంద భాష్పాలు రూపంలో కంటతడి పెట్టుకున్నారట. మహేష్ నటన చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారట. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మహేష్ భుజం తట్టి తన సంతోషాన్ని తెలిపారట. అందుకే నాన్నగారు ఇచ్చిన ఆ రెస్పాన్స్ ఎంతో ప్రత్యేకమైనది అని మహేష్ తెలిపారు. మురారి చిత్రంలో మహేష్ కి జోడిగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాలో ఒక హైలైట్. అదే విధంగా మణిశర్మ సంగీతం కూడా అద్భుతంగా అలరించింది.