Thalaivar 171 movie : రజనీకాంత్ పేరు చెప్పి యువతి దగ్గర 4 లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. బెంగుళూరులో బయటపడ్డ మోసం
సూపర్ స్టార్ రజనీకాంత్ చివరగా లాల్ సలామ్ అనే చిత్రంలో నటించారు. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. అయితే ఇది రజనీకాంత్ పూర్తి స్థాయి చిత్రం కాదు. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జైలర్ లాంటి భారీ హిట్ తర్వాత రజని ఇలాంటి చిత్రంలో నటించకుండా ఉండాల్సింది అని అంటున్నారు.
అయితే ప్రస్తుతం రజని ఫ్యాన్స్ అందరి కళ్ళు లోకేష్ కనకరాజ్ చిత్రంపైనే ఉన్నాయి. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ చిత్రం నిర్మిస్తోంది. లోకేష్ కనకరాజ్ తలుచుకుంటే వండర్స్ సృష్టించగలడు. దీనితో రజనీకాంత్ తో లోకేష్ అదిరిపోయే చిత్రం తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని కొందరు కేటుగాళ్లు వాడుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాగైనా నటించాలని ప్రతి నటీనటులు కోరుకుంటారు. దీనితో ఆడిషన్స్ ఎక్కడ జరిగినా వెళ్లి పాల్గొంటారు. దీనితో బెంగుళూరులో తలైవర్ 171 మూవీ ఆడిషన్స్ అంటూ కొందరు ఆన్లైన్ లో ప్రకటన ఇచ్చారు.
నిజమే అనుకుని కొందరు యువతీ యువకులు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. తాము కాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ అక్కడున్న వాళ్ళు యువతీ యువకుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. అయితే ఓ యువతికి మాత్రం ఈ కేటుగాళ్లు భారీగానే టోపీ పెట్టారు. రజనీకాంత్ మూవీలో కీలక పాత్రలో నీకు ఛాన్స్ ఉందని ఆమెని ఆశ పెట్టారు. దీనితో మృదుల అనే యువతి వాళ్ళకి 4 లక్షలు ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ ఊసే లేదు. దీనితో మృదుల బోరున విలపిస్తూ పోలీసులని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.