జూనియర్ యన్.టి.ఆర్ భారీ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో,
త్రివిక్రమ్ క్లాస్ టచ్ తో ప్రేక్షకులను కూర్చున్న సీట్లోనే కదలనివ్వకుండా మ్యాజిక్ చేసే మాటల మాంత్రికుడు. వంద అడుగుల్లో నీళ్లు పడతాయి అంటే తొంబై తొమ్మిది అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడ్ని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను..నేను ఆ ఒక్క అడుగుతో సమానం సార్. తవ్వి చూడండి అంటూ ఈ సినిమాలో ఉన్న డైలాగ్ అలా ఎన్టీఆర్ లో దాగున్న మృదు స్వభావం కలిగిన సిసలైన నటుడిని ఆఖరి అడుగు తవ్వి బయటకు తెచ్చిన చిత్రం అరవింద సమేత.
తారక్, పూజా హెగ్డ్ హీరో హీరోయిన్ల గా కలసి నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #2YearsForSensationalASVR హ్యాష్ ట్యాగ్ హల్‌చల్ చేసింది. త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇదే.
సినిమా ఎప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, లేదా హీరో ఆశయం నేరవేరడం అనేది మూస పద్దతి, కానీ ఈ సినిమాలో హీరో తన నాయనమ్మ కోరుకొన్న ఆశయాన్ని నెరవేర్చటం కోసం ఏం చేసాడనేది విభిన్నమైన అంశం.30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం, అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం, అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం అదే కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? కాలానుగుణంగా మనుషుల్లో రావాల్సిన మార్పు గురించి త్రివిక్రమ్ “కత్తి” అనే పదాన్ని వాడి అరవింద సమేత కథ ద్వారా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చెప్పారు.
రాజకీయం ఫ్యాక్షన్ అంశాలతో మంచి నిర్మాణాత్మక విలువలతో త్రివిక్రమ్ తన పంథా మార్చుకుని తను కూడా రాయలసీమ ఫ్యాక్షన్ మీద సినిమా తీయగలను అని నిరూపించాడు. శాంతి పెంపొందించడమే లక్ష్యం గా ఫ్యాక్షన్ రాజకీయాలని అంతమొందించే కథతో హారికా-హాసిని నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కింది.
విలన్ గా జగపతిబాబు పోషించిన బసిరెడ్డి పాత్ర ఈ చిత్రానికి మరో ఆయువుపట్టు. తగ్గితే తప్పేంటి, తనదైన రోజున ఎవడైనా కొడతాడు అసలు గొడవ రాకుండా ఆపేవాడే మగాడు అంటూ హీరో పాత్రని అనుక్షణం మలిచే అవీ పాత్రను పూజా హేగ్డే అవలీలగా చేసేసింది. సినిమా క్లైమాక్స్ లో బసిరెడ్డి భార్యను MLA ను చేసిన రాఘవ పాత్రను మహిళా ప్రేక్షకుల హృదయాల్లో శిఖరాగ్రానికి తీసుకెళ్లిన ఘనత అరవింద సమేతకు దక్కుతుంది.
త్వరలోనే ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఇటీవల త్రివిక్రమ్ తెలిపారు. నందమూరి అభిమానులు అరవింద లాంటి మరో అద్భుత చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశ ఎప్పటికి నెరవేరుతుందో వేచి చూడాలి.