ఫ్లాప్ మూవీతో మెగా మేనల్లుడు సంచలనం.. ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి రికార్డు బ్రేక్
మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీనే ఒక సంచలనం. ఉప్పెన మూవీ ద్వారా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ మెగా కుర్రాడు. అయితే ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ కి ఒక్క హిట్ కూడా రాలేదు. రంగ రంగ వైభవంగా, కొండపొలం చిత్రాలతో పాటు గత ఏడాది విడుదలైన ఆదికేశవ చిత్రం కూడా దారుణంగా నిరాశపరిచింది.
కానీ ఆది కేశవ చిత్రం తాజాగా చిత్ర పరిశ్రమకి, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మూవీ సాధించిన రికార్డు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యంలో మునిగి పోవాల్సిందే. ఇటీవల ఈ చిత్రాన్ని స్టార్ మాలో బుల్లితెరపై తొలిసారి ప్రీమియర్ టెలికాస్ట్ చేశారు. అయితే దిమ్మ తిరిగే విధంగా ఈ చిత్రం రికార్డు టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిన విధానానికి, బుల్లితెరపై నమోదు చేసిన టిఆర్పి రేటింగ్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఏకంగా 10.47 టీఆర్పీ రేటింగ్ తో సంచలనం సృష్టించింది. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో ఇదే బిగ్గెస్ట్ టీఆర్పీ.
చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, నాని లాంటి హేమాహేమీల చిత్రాలనే బీట్ చేస్తూ ఆదికేశవ చిత్రం రికార్డు సృష్టించింది. ఆదిపురుష్ కి బుల్లితెరపై 9 వరకు రేటింగ్ నమోదైంది. అలాగే భగవంత్ కేసరి చిత్రం 8 వరకు టిఆర్పి సాధించింది. ఇక వాల్తేరు వీరయ్య, దసరా చిత్రాలకు రేటింగ్ 6 లోపే నమోదైంది. వీటన్నింటినీ అధికమిస్తూ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సంచలనం సృష్టించాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ లో విడుదలయింది. వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల ఈ చిత్రంలో నటించడం విశేషం.
