సినీ హీరో అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించి, సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఆగస్ట్ 22 న ఆయన పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు అంటే అభిమానుకు ఒక పండగే. ప్రతి పుట్టినరోజుకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మెగా అభిమానులు ఈసారి కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు వారం రోజులు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, మినీ వెంటిలేటర్లు అందజేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక పుట్టినరోజు నాడు రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు లాంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేపడతారు.
ఈ సంవత్సరం తన అభిమానులకు పుట్టినరోజు కానుకగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. మంగళవారం దానికి సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. బిగించిన పిడికిలి లో ఎర్రటి కండువా గాలికి రెపరెపలాడుతూ ఉన్నట్లు ఉన్న ఆ పోస్టర్ రాబోయే మోషన్ పోస్టర్ పై ఆసక్తి రేకెత్తించింది.
కొరటాల శివ తన చిత్రాలలో అంతర్లీనంగా సామాజిక అంశాలను భాగం చేయడంలో సిద్ధహస్తుడు. అలాంటి దర్శకుడి చేతిలో సామాజిక స్పృహ కలిగిన మెగాస్టార్ చిరంజీవి నటించడం వలన చిత్రం ఎలా రూపుదిద్దుకుంటోంది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకోని ఉంది. చిరంజీవి జన్మదినం నాడు విడుదల చేసే పోస్టర్ కోసం అటు అభిమానులే కాక ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.